COVID19 Cases Surge: దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ పడగ విప్పిన కరోనా, అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, వ్యాప్తి ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాలకు అత్యవసరంగా నిపుణుల బృందాల తరలింపు
పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న 10 రాష్ట్రాలకు కేంద్రం నిపుణుల బృందాలను తరలించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కూడా ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ -19 స్థితిగతులను అంచనా వేసేందుకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం...
New Delhi, February 26: అకస్మాత్తుగా పలు రాష్ట్రల్లో కోవిడ్ -19 కేసుల సంఖ్య పెరిగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న 10 రాష్ట్రాలకు కేంద్రం అత్యవసరంగా నిపుణుల బృందాలను తరలించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కూడా ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ -19 స్థితిగతులను అంచనా వేసేందుకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌ఘర్, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు జమ్మూ కాశ్మీర్ లలో కేంద్రం ఉన్నతస్థాయి నిపుణుల బృందాలను నియమించింది. ఈ రాష్ట్రాలకు పంపిన బృందాలలో ప్రజారోగ్య నిపుణులు మరియు ఎపిడెమియాలజిస్ట్ లు ఉన్నారు. ఈ బృందాలు ఆయా రాష్ట్రల్లోని ఆరోగ్య శాఖ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ కోవిడ్ వ్యాప్తిని నియంత్రించే చర్యలు చేపట్టనున్నారు. వైరస్ వ్యాప్తి విస్తరించకుండా చైన్ ను విడగొట్టే చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసింది.
పలు రాష్ట్రాల్లో కోవిడ్ -19 నిర్ధారణ పరీక్షలు తగ్గించడం కూడా కేసుల పెరుగుదలకు ఒక కారణమని కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని కోవిడ్ -19 ప్రభావిత జిల్లాల్లో ఎక్కువ శాంపుల్స్ పరీక్షించడంతో పాటు కోవిడ్ యాంటిజెన్ పరీక్షల సామర్థ్యాన్ని కూడా పెంచాలని సూచించింది.
వైరస్ సోకిన వ్యక్తులను వెంటనే ఐసోలేట్ చేసి ఆసుపత్రిలో చేర్చాలి, అలాగే వారికి సన్నిహితంగా మెలిగిన వారిని కూడా ఆలస్యం చేయకుండా గుర్తించి వెంటనే కోవిడ్ పరీక్షలు జరపాలి. కోవిడ్ -19 నియంత్రణలో ఇప్పటివరకు అనుసరించిన వ్యూహాలను అధ్యయనం చేస్తూ సంబంధిత జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది.