Chakka Jam: దేశ వ్యాప్తంగా రైతుల రాస్తారోకో, మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు రోడ్లు దిగ్బంధం, కొత్త చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ మినహా మిగతా దేశమంతా రైతుల చక్కా జామ్

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో దాదాపు 72 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు నేడు దేశవ్యాప్తంగా రాస్తారోకో (chakka jam protest) నిర్వహించనున్నారు.

Security tightened in Delhi amid 'Chakka Jaam Call (Photo Credits: ANI)

New Delhi, February 6: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో దాదాపు 72 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు నేడు దేశవ్యాప్తంగా రాస్తారోకో (chakka jam protest) నిర్వహించనున్నారు. వివాదాస్పదమైన మూడు వ్యవసాయ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు రోడ్లను దిగ్బంధించనున్నారు. రాస్తారోకో సందర్భంగా ఆయా ప్రాంతాల్లో వాహనాల్లో చిక్కుకుపోయిన ప్రజలకు మంచినీళ్లు, స్నాక్స్ అందించాలని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ (Rakesh Tikait) కోరారు.

మరోవైపు, తాము జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేలను మాత్రమే దిగ్బంధిస్తామని, స్కూలు బస్సులు, అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాలను అడ్డుకోబోమని 41 యూనియన్ల రైతు సమైక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. మూడు గంటలకు రాస్తారోకో (Chakka Jaam) ముగిసే సమయంలో వాహనాల హారన్లను ఓసారి మోగించాలని సూచించింది. రిపబ్లిక్ డే ట్రాక్టర్ ర్యాలీ తర్వాత తలపెట్టిన అతిపెద్ద నిరసన కార్యక్రమంగా చక్కా జామ్‌ నిలవనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భదత్రను కట్టుదిట్టం చేశారు. ఘాజీపూర్‌, టిక్రీ, సింగు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

కుప్పకూలిన రైతుల వేదిక, మహాపంచాయతీ సమావేశంలో అపశృతి, ఒక్కసారిగా స్టేజ్‌మీదినుంచి కింద పడిపోయిన రైతు నేతలు, ఇతరులు

ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ మినహా మిగతా దేశమంతా చక్కా జామ్ ఉంటుందని భారతీయ కిసాన్ యూనిన్ నేత రాకేశ్ తికాయిత్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొందరు హింసకు పాల్పడే అవకాశం ఉన్నందున ఈ మూడు రాష్ట్రాల్లో బంద్‌ను వాయిదా వేసినట్లు చెప్పారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న ప్రాంతాలు మినహా ఢిల్లీలో ఎక్కడా చక్కా జామ్ ఉండదని స్పష్టం చేశారు. చక్కాజామ్‌ ముగియడానికి ముందు ఒక నిమిషం పాటు వాహనాలతో హారన్‌ కొట్టి రైతులకు సంఘీభావం తెలుపుతామని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై నిరసనలు శాంతియుతంగా కొనసాగనున్నాయని తెలిపారు. ఎటువంటి ఘర్షణలకు, వాగ్వాదాలకు పాల్పడవద్దని ఆందోళనకారులకు సూచించారు. అలాగే అంబులెన్సులు, స్కూల్ బస్సులను ఈ నిరసననుంచి మినహాయింపు నిస్తున్నట్టు సంయుక్తి కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. 'చక్కా జామ్‌' కార్యక్రమానికి కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఇరువురూ అత్యంత సంయమనం పాటించాలని అటు అధికారులు, ఇటు ఆందోళనకారులకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.

రైతుల ఉద్యమానికి విదేశీ సెలబ్రీటీల మద్దతు, సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం, వాస్తవాలు తెలుసుకోవాలంటూ బాలీవుడ్ సెలబ్రిటీలు ఘాటు రిప్లయి

మరోవైపు 50 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో పారామిలిటరీ, రిజర్వ్‌ దళాలను మోహరించారు. వాటర్‌కెనాన్లను సిద్ధం చేశారు. 12 మెట్రో స్టేషన్ల వద్ద హై అలర్ట్‌ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో వాటర్‌ కెనాన్లను సిద్ధం చేయడంతో పాటు డ్రోన్ల ద్వారా పోలీసులు నిఘా పెట్టారు.

ఎర్రకోట వద్ద భారీఎత్తున పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.ఘాజీపూర్ సరిహద్దు వద్ద చక్కా జామ్ సందర్భంగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతులు గుమికూడకుండా చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కానన్ లను సిద్ధం చేసి ఉంచారు. కాగా ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ లలో శాంతియుతంగా నిరసన తెలుపుతామని రైతు సంఘాల నేతలు చెప్పారు.