Farmers' protest in Delhi | (Photo Credits: PTI)

New Delhi, Feb 3: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం (Farmers Protest) చేస్తోన్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు (International Celebrities on Farmers' Protest) రైతుల ఉద్యమానికి మద్దతునిస్తుండగా.. తాజాగా ఈ జాబితాలోకి హాలీవుడ్‌ పాప్‌ స్టార్‌ రిహన్నా చేరారు. ట్విట్టర్లో 100 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న రిహన్నా (Rihanna) అన్నదాతలు చేస్తోన్న ఉద్యమంపై స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో రైతుల ఉద్యమానికి సంబంధించని ఓ న్యూస్‌ ఆర్టికల్‌ క్లిప్‌ని షేర్‌ చేస్తూ.. మనం ఎందుకు దీని గురించి మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు.

ఇక ఈ పేపర్‌ క్లిప్‌ సీఎన్‌ఎన్‌ది కాగా.. దీనిలో గణతంత్ర దినోత్సవ వేడుకల నాడు రైతు ఉద్యమం ఉద్రిక్తంగా మారడం.. హింస చేలరేగడంతో ఢిల్లీ చుట్టుపక్కల ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారని తెలిపే కథనానికి సంబంధించింది. అలానే మయన్మార్‌లో ఆర్మీ దురగతాలను కూడా రిహన్నా ప్రశ్నించారు.

ఇక రిహన్నా ట్వీట్‌కు బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ రిప్లై ఇచ్చారు. ‘‘దీని గురించి ఎవరు మాట్లాడటంలేదు ఎందుకంటే వారు దేశాన్ని విభజించాలని చూస్తోన్న ఉగ్రవాదులు. వీరు దేశాన్ని విభజిస్తే.. చైనా దాన్ని స్వాధీనం చేసుకుని అమెరికా లాంటి ఓ కాలనీని తయారు చేయాలని ఎదురు చూస్తోంది. మీలాంటి డమ్మీలకు మా దేశాన్ని అమ్మం’’ అంటూ కంగనా ఘాటుగా రిప్లై ఇచ్చారు.

Rihanna Tweet

ఇక రైతుల ఉద్యమానికి యువ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ మద్దతు తెలిపారు. భారతదేశంలోని రైతులకు సంఘీభావం తెలుపుతున్నాము అంటూ ట్వీట్‌ చేశారు. ఇక అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్‌ మేనకోడలు మీనా హారిస్‌ కూడా రైతులకు మద్దతు తెలిపారు.

Here's MEA Statement

ఇదిలా ఉంటే రైతుల ఆందోళ‌న‌ల‌పై ట్వీట్లు చేస్తున్న ఇంట‌ర్నేష‌న‌ల్ సెల‌బ్రిటీల‌పై కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా మండిప‌డింది . ఇది స‌రైన‌ది కాదని, బాధ్య‌తారాహిత్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఇది దేశంలోని ఓ ప్రాంతంలో కొద్ది మంది రైతులు మాత్ర‌మే చేస్తున్న ఆందోళ‌న. ఇది భార‌త‌దేశ అంత‌ర్గత వ్య‌వ‌హారం. ఇలాంటి వాటిపై స్పందించే స‌మ‌యంలో వాస్త‌వాలు తెలుసుకోవాలి. వాటిని అర్థం చేసుకోవాలి.

ఇలాంటి అంశాంపై సెల‌బ్రిటీల సెన్సేష‌న‌లిస్ట్ సోష‌ల్ మీడియా హ్యాష్‌ట్యాగ్‌లు, కామెంట్లు స‌రికావు. వారిది బాధ్య‌తా రాహిత్యం అని విదేశాంగ శాఖ స్ప‌ష్టం చేసింది. రైతుల్లోని కొన్ని స్వార్థ‌ప‌ర‌మైన గ్రూపులు త‌మ ఎజెండాను ఈ ఆందోళ‌న‌ల‌పై రుద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని, ఈ గ్రూపులే ఇండియాకు వ్య‌తిరేకంగా అంత‌ర్జాతీయ మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నాయ‌ని అందులో తెలిపింది. అలాంటి వాళ్ల వ‌ల్లే కొన్ని దేశాల్లో మ‌హాత్మా గాంధీ విగ్ర‌హాల ధ్వంసం జ‌రుగుతోంద‌ని, ఇది ఇండియాను చాలా బాధించింద‌ని చెప్పింది.

రైతుల ఉద్యమానికి దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు మద్దతు తెలుపుతుండగా కొందరు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కేంద్రానికి మద్దతు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. "దేశ నిర్మాణంలో రైతులకు ముఖ్యమైన స్థానం ఉంది. వారి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం అన్నిరకాలుగా ప్రయత్నిస్తోంది. ఏవేవో మాట్లాడి వారి మధ్య విభేదాలు సృష్టించి హైలెట్‌ అవాలని చూడటానికి బదులు ఇద్దరి మధ్య స్నేహపూర్వక తీర్మానాలు జరగాలని ఆశిద్దాం" అని అక్షయ్‌ పేర్కొన్నారు.

దీనికి #IndiaTogether, #IndiaAgainstPropaganda అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు. అలాగే మరో ప్రముఖ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ సైతం భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మకండని సూచించారు. ఇది మనందరం కలిసి కట్టుగా నిలబడాల్సిన సమయమని పేర్కొన్నారు.