Chinmayanand Rape Case: చిన్మయానంద కేసులో ఊహించని మలుపు, లా విద్యార్థినిని అరెస్ట్ చేసే అవకాశం, బంధువులతో కలిసి దోపిడీకి పథక రచన..! , అరెస్ట్ తర్వాత 14 రోజుల రిమాండుకు కేంద్ర మాజీ మంత్రి
ఈ కేసులో న్యాయ వాద విద్యార్థినిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Lucknow, September 22: అత్యాచారం కేసులో అరెస్టయిన బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి స్మామి చిన్మయానంద కేసు రోజు రోజుకు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో న్యాయ వాద విద్యార్థినిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. Special Investigation Team (SIT)నుంచి వస్తున్న అనధికార సమాచారం తన కుటుంబ సభ్యులతో కలిసి న్యాయవాద విద్యార్థిని దోపిడికి పథక రచన చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంధువు సంజయ్ సింగ్, ఇద్దరు కజిన్స్ సచిన్ సింఘార్, విక్రామ్ లతో కలిసి ఆమె దోపిడికి వ్యూహ రచన చేసిందని నిందారోపణలు వినిపిస్తున్నాయి. చిన్మయానందను కస్టడీలోకి తీసుకున్న తరువాత వీరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అన్ని పరిశోధనలు పూర్తయినందున బాధితురాలిని అరెస్ట్ చేసేముందు సుప్రీంకోర్టుకు తెలియజేస్తామని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ సిట్ అధికారి తెలిపారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లోని ఎస్‌ఎస్ న్యాయ కాలేజీ చెందిన లా స్టూడెంట్ చిన్మయానంద్ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడంటూ ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. 'నాది షాజహాన్‌పూర్. నేను ఎస్‌ఎస్ కాలేజీలో ఎల్‌ఎల్‌ఎం చదువుతున్నాను. ఓ స్వామిజీ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడు. అతనికి వ్యతిరేకంగా నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు నన్ను, నా కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. మోడీ, యోగి ఆదిత్యనాథ్ నన్ను ఆదుకోవాలి. నాకు న్యాయంచేయండి' అంటూ వీడియోలో విజ్ఞప్తి చేసింది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాతి నుంచి సదరు యువతి ఆచూకీ లేకుండా పోయారు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గత నెలలో పోలీసులు చిన్మయానందపై కిడ్నాప్, వేధింపుల కింద కేసు నమోదు చేశారు. ఆరు రోజుల తర్వాత ఆమె రాజస్థాన్‌లో కనిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అదే రోజు ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్ దర్యాప్తునకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
తాను స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన చిన్మయానంద.. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాది పాటు లైంగికదాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇదే విషయాన్ని ఆమె కోర్టులో న్యాయమూర్తి ముందు కూడా చెప్పింది. తుపాకీతో బెదిరించి తన చేత బలవంతంగా మసాజ్ కూడా చేయించుకున్నాడని సదరు లా విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసిన యూపీ పోలీస్ శాఖ బాధితురాలు ఇచ్చిన ఆధారాల ఆధారంగా చిన్మయానందను అదుపులోకి తీసుకుంది. ఆ యువతి ఇచ్చిన పెన్‌డ్రైవ్‌లో 43 వీడియోలు ఉన్నట్లు సమాచారం. భారీ బందోబస్తు మధ్య శనివారం ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు.ఆయనకు న్యాయస్థానం 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీని విధించింది.
ఇదిలా ఉంటే లైంగిక వేధింపుల నేరారోపణలపై అరెస్టు అయిన చిన్మయానంద కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని బాధితురాలు, న్యాయశాస్త్ర విద్యార్థిని ఆరోపించింది. తనపై అత్యాచారానికి పాల్పడి చిన్మయానంద చాలా పెద్ద తప్పు చేశారు. కాని చిన్న శిక్ష విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తనకు అసంతృప్తిగా ఉందని, సెక్షన్ 376కి బదులు సెక్షన్ 376సి విధించటం సరికాదని ఆమె పేర్కొన్నారు. కాగా న్యాయ విద్యార్థిని చేసిన ప్రతి ఆరోపణనణను బీజేపీ నేత అంగీకరించినట్లు సిట్ చీఫ్ నవీన్ ఆరోరా తెలిపారు.
సిట్ చీఫ్ నవీన్ ఆరోరా
లైంగిక సంభాషణలు, బాడీ మసాజా చేయించుకున్నట్లు కూడా మాజీ మంత్రి ఒప్పుకున్నారు. అన్ని సాక్ష్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు సిట్ చీఫ్ తెలిపారు. తన అకృత్యాల పట్ల తనకే సిగ్గు వేస్తుందని, అందుకే మరింత సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నట్లు చిన్మయానంద పోలీసులకు తెలిపారు.