CJI Ranjan Gogoi's LWD: జస్టిస్ రంజన్ గొగోయ్‌కి ఈరోజే చివరి పనిదినం, నవంబర్ 17న పదవీ విరమణ, అదేరోజు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ఎస్.ఎ.బాబ్డే

19 ఏళ్ల క్రితం బాంబే హైకోర్టులో అడిషనల్ న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బాబ్డే ప్రస్తుతం దేశంలో....

CJI Ranjan Gogoi and SA Bobde (Photo Credits: PTI)

New Delhi, November 15:  భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ (Ranjan Gogoi) ఈరోజు తన చివరి పనిదినాన్ని (Last Working Day) ముగించారు. ఎల్లుండి నవంబర్ 17న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అయితే నవంబర్ 17 ఆదివారం వస్తుండటంతో శుక్రవారమే తన చివరి పనిదినాన్ని జస్టిస్ గోగోయ్ పూర్తి చేసుకున్నారు. ఈరోజు, తన చివరి పనిదిన సందర్భంగా జస్టిస్ గోగోయ్, కాబోయే ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే (Sharad Arvind Bobde) తో కూర్చుని జాబితా చేయబడిన మొత్తం 10 కేసులకు సంబంధించి ఒకేసారి నోటీసులు జారీ చేశారు.

అక్టోబర్ 3,  2018న ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ గొగోయ్ సుప్రీం కోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.  నవంబర్ 17న ఆదివారం సాయంత్రం 4 గంటలకు రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంకో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్వర్యంలో ఆయనకు వీడ్కోలు పలకనున్నారు.

రంజన్ గొగోయ్ చీఫ్ జస్టిస్ గా వ్యవహరించిన కాలంలో ఆయోధ్య రామ్ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేసు, రాఫేల్ కుంభకోణం కేసు లాంటి అనేక కీలకమైన కేసులలో చారిత్రాత్మక తీర్పులు వెలువరించారు.

 జస్టిస్ రంజన్ గొగోయ్  స్థానంలో జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే,  వీరి నేపథ్యం ఇదీ!

 

అస్సాం రాష్ట్రానికి చెందిన జస్టిస్ రంజన్ గొగోయ్ 1978లో బార్ కౌన్సిల్‌లో చేరారు. గౌహతి హైకోర్టులో కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అనంతరం ఫిబ్రవరి 28, 2001న హైకోర్ట్ శాశ్వత న్యాయమూర్తిగా నియమింపబడ్డారు. ఆ తరువాత పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ అయ్యారు. కొద్ది కాలంలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడ్డారు. ఇక 2012 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ గొగోయ్, అదే క్రమంలో 2018 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య భారతదేశం నుండి భారత ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి వ్యక్తి గోగోయ్.

ఇక నవంబర్ 17న రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేస్తుండటంతో, అదే రోజు ఈయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే (63) భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 19 ఏళ్ల క్రితం బాంబే హైకోర్టులో అడిషనల్ న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బాబ్డే ప్రస్తుతం దేశంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. సుప్రీం కోర్టులో జస్టిస్ బాబ్డే విచారణ జరిపిన కేసుల్లో అయోధ్య కేసుతో పాటు, ఆధార్ ఆర్డినెన్స్ కేసు, ఆర్టికల్ 370 కేసు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ కేసు తదితరమైనవి ముఖ్యమైనవిగా ఉన్నాయి.