Navjot Sidhu Released: ఏడాది జైలుశిక్ష తర్వాత రిలీజయిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, డోలువాయిద్యాలతో స్వాగతం పలికిన కార్యకర్తలు
జైలు ముందు ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు డోలు మోగిస్తూ డ్యాన్సులు చేశారు. సిద్ధూ విడుదల నేపథ్యంలో వారు భారీగా జైలు వద్దకు చేరుకున్నారు.
Patiala, April 01: కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) 10 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. జైలు ముందు ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు డోలు మోగిస్తూ డ్యాన్సులు చేశారు. సిద్ధూ విడుదల నేపథ్యంలో వారు భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. పంజాబ్ లోని పాటియాలాలో 1998లో కారు పార్కింగ్ విషయంలో సిద్ధూ, తన స్నేహితుడు కలిసి గుర్నామ్ సింగ్ అనే వ్యక్తితో గొడవపడ్డారు. గుర్నామ్ సింగ్ ను గాయపర్చారు. ఆ తర్వాత అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసు (1988 road rage case) లోనే సిద్ధూకి సుప్రీంకోర్టు (Supreme Court ) సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది మే వరకు ఆయన జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. అయితే, సత్ప్రవర్తన కారణంగా ఆయన దాదాపు 50 రోజుల ముందుగానే విడుదల అయ్యారు. ఆయన అభిమానులు, కార్యకర్తలు జైలు వద్ద డ్యాన్సులు వేస్తున్నారు. అందరికీ అభివాదం చేస్తూ సిద్ధూ జైలు బయటకు వచ్చారు. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా అక్కడకు వచ్చారు. పాటియాలా జైలు వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. సిద్ధూ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. సిద్ధూ విడుదల తమకు పండుగ అని ఓ కాంగ్రెస్ నేత చెప్పారు.
జైలు నుంచి విడుదలైన సిద్ధూ (Siddu) ఆ వెంటనే మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు ప్రధాని మోదీపై ఆయన మండిపడ్డారు. పంజాబ్‌లో హింసను బీజేపీ ప్రేరేపిస్తున్నదని ఆరోపించారు. మైనార్టీలను టార్గెట్ చేస్తున్నారని, పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. ‘పంజాబ్‌ను బలహీనపరచాలని ప్రయత్నిస్తే మీరు బలహీనంగా మారతారు’ అంటూ కేంద్రంపై మండిపడ్డారు.
మరోవైపు తాను ఈ మధ్యాహ్నం విడుదల కావాల్సి ఉందని సిద్ధూ తెలిపారు. అయితే మీడియా అంతా వెళ్లిపోయేందుకే తన విడుదలను ఆలస్యం చేశారని మండిపడ్డారు. దేశంలో ఎప్పుడైతే నియంతృత్వం ఏర్పడిందో, విప్లవం కూడా అప్పుడే వచ్చిందని ఆయన అన్నారు. ‘ఆ విప్లవం పేరు రాహుల్ గాంధీ. ఈరోజు నేను నా ఛాతీని తట్టి చెబుతున్నా. బీజేపీ ప్రభుత్వ మూలాలను రాహుల్ గాంధీ కదిలిస్తారు’ అని సిద్ధూ అన్నారు.
పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్ మాన్‌ను కూడా సిద్ధూ విమర్శించారు. పంజాబ్ ప్రజలను ఎందుకు మోసం చేశావు? అని ప్రశ్నించారు. ‘ఎన్నికలప్పుడు పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. జోకులు పేల్చారు. కానీ మీరు ఇవాళ కాగితంపై ముఖ్యమంత్రిగా ఉన్నారు’ అని సిద్ధూ ఎద్దేవా చేశారు.