Rahul Gandhi on Gujarat Elections: ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే మరోలా ఉండేది, గుజరాత్ ఎన్నికలపై రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్స్, ఆమ్‌ ఆద్మీ పార్టీ సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేసిందంటూ ఆరోపణ

1995 నుంచి గుజరాత్ అసెంబ్లీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీని పూర్తిగా నిలువరించలేకపోయినప్పటికీ.. మొదటిసారి డబుల్ డిజిట్‭కు తీసుకువచ్చింది. కానీ ఈసారి ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం పోటీని ఇవ్వలేకపోయింది.

Bharat Jodo Yatra (Photo-ANI)

Jaipur, DEC 16: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కనుక లేకపోయుంటే తమ తడాఖా చూపించేవాళ్లమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) అన్నారు. బీజేపీకి రహస్య ప్రతినిధిగా ఆప్ ఎన్నికల్లో పోటీకి దిగిందని, దాంతో ఓట్లు చీలిపోయి తాము ఓడిపోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. లేదంటే, తమ చేతిలో బీజేపీ ఓడిపోయి ఉండేదని అన్నారు. భారత్ జోడో యాత్ర 100వ రోజు పూర్తైన సందర్భంగా రాజస్తాన్ రాజధాని జైపూర్‭లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక మాట మీకు స్పష్టం చేస్తున్నాను. కాంగ్రెస్ (Congress) పార్టీని టార్గెట్ చేయడానికి ఆప్‭ను రహస్య ప్రతినిధిగా నియమించుకున్నారు. ఒకవేళ్ ఆప్ అలా ఉండకపోయి ఉంటే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో (Gujarat Election) బీజేపీ ఓడిపోయి ఉండేది. బీజేపీ దానికున్న శక్తినంతటినీ ఉపయోగించింది. కానీ, కాంగ్రెస్ దాన్ని ఢీకొట్టగలిగింది. కాంగ్రెస్‌ అనేది ఏంటిది, ఎవరి పక్షాన నిలబడతుందో లోతుగా అర్థం చేసుకున్న రోజు ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

వాస్తవానికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 17 స్థానాలు మాత్రమే గెలిచింది. భారతీయ జనతా పార్టీ 156 స్థానాలతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆప్ (AAP) 5 స్థానాల్లో గెలిచింది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ 52 శాతం ఓట్ బ్యాంకు సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 28 శాతం ఓట్ బ్యాంక్ సాధించగా, ఆప్ 13 శాతం ఓట్ బ్యాంక్ సాధించింది. ఒకవేళ రాహుల్ చెబుతున్నట్లే ఆప్ పోటీలో లేకపోయినా మొత్తం ఓట్ బ్యాంక్ 41 శాతమే. ఈ లెక్కన చూసుకున్నా బీజేపీనే విజయం సాధిస్తుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అయితే 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ హోరాహోరి పోటీని ఇచ్చింది. 1995 నుంచి గుజరాత్ అసెంబ్లీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీని పూర్తిగా నిలువరించలేకపోయినప్పటికీ.. మొదటిసారి డబుల్ డిజిట్‭కు తీసుకువచ్చింది. కానీ ఈసారి ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం పోటీని ఇవ్వలేకపోయింది. చాలా స్థానాల్లో పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాలేదంటే కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ వెళ్లలేదు. భారత్ జోడో యాత్ర చేస్తున్నందున గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లలేదని కాంగ్రెస్ పేర్కొంది.