COVID-19 in India: ఒక్క రోజులోనే 773 పాజిటివ్ కేసులతో భారతదేశంలో 5,194కు పెరిగిన కోవిడ్-19 బాధితులు, 149కి చేరిన మరణాల సంఖ్య, మహారాష్ట్రలో వెయ్యి దాటిన పాజిటివ్ కేసులు
మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడగా చెప్పబడే ధారావిలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇప్పటివరకు ఇక్కడ 9 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక మరణం సంభవించింది. ఈ ధారావి ప్రాంతంలో అతి స్వల్ప విస్తీర్ణంలో సుమారు 10 లక్షల వరకు జనం నివసిస్తారని అధికారుల అంచనా...
New Delhi, April 8: భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి (COVID-19 in India) విజృంభిస్తుంది. బుధవారం ఉదయం నాటికి దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5,194 కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ (Ministry of Health and Family Welfare) ధృవీకరించింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 773 కొత్త COVID-19 పాజిటివ్ కేసులు నిర్ధారించబడినట్లు తెలిపింది. ఇక ఈ కరోనావైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 149 చేరుకోగా, చికిత్స తర్వాత 401 బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం తెలిపింది. మొత్తం మీద దేశంలో ప్రస్తుతం 4,643 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
ఇక వైరస్ చేత అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (Maharashtra) మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇక్కడ కరోనావైరస్ కేసుల సంఖ్య 1018కి చేరుకుంది. ఒక్క ముంబై నగరంలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 736గా ఉంది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడగా చెప్పబడే ధారావిలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇప్పటివరకు ఇక్కడ 9 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక మరణం సంభవించింది. ఈ ధారావి ప్రాంతంలో అతి స్వల్ప విస్తీర్ణంలో సుమారు 10 లక్షల వరకు జనం నివసిస్తారని అధికారుల అంచనా. దీంతో ఈ ప్రాంతం నుంచి నమోదవుతున్న ఒక్కోకేసు మహారాష్ట్ర ప్రభుత్వానికి చమటలు పుట్టిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 64 కరోనా మరణాలు నమోదు కాగా అందులో 40కి పైగా మరణాలు ముంబై నుంచే ఉండటం ద్వారా నగరంలో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
Check ANI tweet:
రోజురోజుకు వందల్లో కేసులు నమోదవుతుండటంతో లాక్డౌన్ పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా ముంబై మరియు పుణె నగరాల్లో అదనంగా రెండు వారాల పాటు కఠిన లాక్డౌన్ అమలు చేయడానికి మహారాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది.
నిజాముద్దీన్ తబ్లిఘి జమాత్ కేసులు వెలుగులోకి వచ్చిన తరువాత గత కొన్ని రోజులుగా దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ మహమ్మారి బారిన పడిన ఇతర రాష్ట్రాల్లో వైరస్ తీవ్రతను పరిశీలిస్తే, తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు 690కి చేరగా, దేశ రాజధాని దిల్లీలో కేసుల సంఖ్య 576కు పెరిగింది. రాష్ట్రాల విజ్ఞప్తులు, నిపుణుల హెచ్చరికలతో లాక్‌డౌన్‌ను పొడగించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం
ప్రజలు లాక్డౌన్ నిబంధనలను మరియు సామాజిక దూరం పాటించకపోతే దేశంలో వైరస్ సంక్రమణ వేగంగా జరుగుతుందని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ హెచ్చరించారు.