New Delhi, April 7: భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి (COVID-19 Outbreak in India) కట్టడి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ (Nationwide Lockdown)ముగియడానికి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఒకవైపు రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య, మరోవైపు లాక్డౌన్ ను పొడగించాల్సిందిగా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు లాక్డౌన్ ను మరింత కాలం పొడగించే ఆలోచనకే కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 14 తర్వాత కర్ఫ్యూ తరహా ఆంక్షల కొనసాగింపుపై సాధ్యాసాధ్యాలను కేంద్రం ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు రిపోర్ట్స్ అందుతున్నాయి.
రాష్ట్రాల నుంచి స్వీకరించిన అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలిస్తోందని, అయితే ఈ వివరాలు ఇప్పటికిప్పుడే బయటకు వెల్లడించకుండా గోప్యంగా వ్యవహరిస్తున్నట్లు కేంద్ర అధికారిక వర్గాల నుంచి సమాచారం అందినట్లు ANI నివేదించింది. భారత్‌లో కోవిడ్-19 అంతం ఎప్పుడు? లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అంశంలో కేంద్రం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటి?
దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తే క్షేత్ర స్థాయిలో వైరస్ వ్యాప్తి విపరీతంగా జరిగే అవకాశం ఉందని నిపుణులు మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
"లాక్డౌన్ పొడిగించాల్సిందిగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తోంది" అని ఏసియన్ న్యూస్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ నివేదించింది.
Update by ANI
A lot of state governments, as well as experts, are requesting Central Government to extend the lockdown. Central Government is thinking in this direction: Government sources pic.twitter.com/iDShmLIS8j
— ANI (@ANI) April 7, 2020
ఒకరోజు 'జనతా కర్ఫ్యూ' ఆ తర్వాత రాష్ట్రాల అంతర్గత ఆంక్షలకు కొనసాగింపుగా గత నెల మార్చి 24 అర్ధరాత్రి నుంచి 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ స్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనావైరస్ వ్యతిరేక పోరాటంలో ఈ మూడు వారాలు అత్యంత కీలకమైనవిగా పీఎం మోదీ పేర్కొన్నారు. అయితే లాక్డౌన్ ప్రకటించే సమయంలో ఇండియాలో సుమారు 300 నుంచి 400 మధ్యలో ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వారాల్లోనే ఏకంగా 4 వేల మార్కును దాటింది. ఈరోజు ఏప్రిల్ 7 ఉదయం నాటికే కేసులు 4,421కి చేరింది. అప్పుడు కేవలం 10 లోపు ఉన్న మరణాలు ఇప్పుడు 100 దాటేశాయి.
ఇప్పటికీ దేశంలో ప్రతిరోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక్క నిజాముద్దీన్ ఘటనతోనే ఇప్పటికే చాలా వ్యాప్తి జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇంకా చాలా మందిని గుర్తించాల్సి ఉంది, కేసులు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంతటి సంకట స్థితిలో లాక్డౌన్ ఎత్తివేస్తే యూఎస్, స్పెయిన్, ఇటలీ తరహా పరిస్థితి భారతదేశంలో ఏర్పడుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ హెచ్చరించారు. వైరస్ వ్యాప్తి కట్టడికి భారత్ వద్ద ఉన్న ఏకైక ఆయుధం లాక్డౌనేనని కాబట్టి నిస్సందేహంగా లాక్డౌన్ పొడగించాలని తాను ప్రధానమంత్రిని అభ్యర్థిస్తున్నట్లు సోమవారం నాటి ప్రెస్ మీట్లో సీఎం కేసీఆర్ వెల్లడించారు.
అసోం, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు కూడా లాక్డౌన్ పొడగించాలనే కోరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ ఎత్తివేయకుండా ఇంకా ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందనే అంశాలను కేంద్రం పరిశీలిస్తుంది.