Hyderabad, April 7: దేశంలో కరోనావైరస్ కట్టడి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రకటించిన 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుంది. అయితే ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా? లేక మరింత పొడగిస్తారా? అనే విషయంపై ఇంకా సందిగ్ధత వీడలేదు. ఇలాంటి సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) మాట్లాడుతూ లాక్‌డౌన్ (Lockdown) ను మరో 2 వారాలు పొడగించాల్సిందిగా ప్రధానమంత్రిని తాను ప్రత్యేకంగా కోరినట్లు సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెలియజేశారు.
ఈ సందర్భంగా భారతదేశంలో లాక్ డౌన్ జూన్ 03 వరకు ఉంచాలని బీసీజీ (Boston Consulting Group) ఇచ్చిన రిపోర్టును సీఎం కేసీఆర్ ఉదహరించారు. కరోనావైరస్ వ్యాప్తి నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు లాక్ డౌన్ మినహా మరో ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డారు. "బతికుంటే బలుసాకు అయినా తినొచ్చు, ఆర్థిక వ్యవస్థను కష్టపడైనా తర్వాత గాడిలో పెట్టవచ్చు, కానీ మనిషి చచ్చిపోతే తిరిగి తీసుకురాలేం" అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే లాక్డౌన్ ఇంకొంత కాలం పొడగిస్తారా? అన్న సందేహం కలుగుతుంది. సాధారణంగా ప్రభుత్వం ఏవైనా నిర్ణయాలు తీసుకునేముందు కేసీఆర్ అందుకు సంబంధించి చిన్న హింట్ ఇస్తారు. తద్వారా ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తారు, ఆపై నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు. ప్రధాని మోదీ కూడా లాక్డౌన్ కొనసాగింపు- దేశ ఎకానమీ తదితర విషయాలపై రాష్ట్రాల ముఖ్యంత్రులతో, దేశంలోని ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తరచూ చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడింది. భారత్‌లో కోవిడ్-19 అంతం ఎప్పుడు? లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అంశంలో కేంద్రం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటి?
అయితే లాక్ డౌన్ పై ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. కోవిడ్-19 తీవ్రత ఎక్కువ ఉన్న చోట లాక్ డౌన్ కొనసాగిస్తూ తక్కువ ఉన్నచోట ఆంక్షలు సడలించే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సీఎం కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ గా ఉండనుంది.