Couple Face Off: భర్తపై పోటీకి రెడీ అయిన భార్య, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికరపోరు, కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇంటిపోరు
ప్రస్తుతం దాంతా రామ్‌గఢ్‌లో (Ramgarh) ఆయనే మళ్లీ బరిలో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే భార్య రీటా చౌధరీ రూపంలో ఆయనకు ఇంట్లోనే ప్రత్యర్థి ఉండటం గమనార్హం! రీటా 2018లో కాంగ్రెస్ తరఫున దాంతా రామ్‌గఢ్ టికెట్ ఆశించి భంగపడ్డారు.
Jaipur, OCT 25: రాజస్థాన్‌లోని దాంతా రామ్‌గఢ్ (Ramgarh) అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అక్కడ భార్యాభర్తలిద్దరూ పరస్పరం ప్రత్యర్థులుగా తలపడే అవకాశాలు ఉండటమే అందుకు కారణం. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ (Virendra singh). ఈయనది కాంగ్రెస్ పార్టీ. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఏడుసార్లు ఎమ్మెల్యే నారాయణ్ సింగ్ కుమారుడాయన. ప్రస్తుతం దాంతా రామ్‌గఢ్‌లో (Ramgarh) ఆయనే మళ్లీ బరిలో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే భార్య రీటా చౌధరీ రూపంలో ఆయనకు ఇంట్లోనే ప్రత్యర్థి ఉండటం గమనార్హం!
రీటా 2018లో కాంగ్రెస్ తరఫున దాంతా రామ్‌గఢ్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పటి నుంచి రాజకీయంగా ఎదగడంపై మరింత దృష్టిపెట్టారు. ఈ ఏడాది ఆగస్టులో జననాయక్ జనతా పార్టీ (JJP)లో చేరారు. ఆ పార్టీలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలయ్యారు. ప్రస్తుతం దాంతా రామ్‌గఢ్‌లో తమ అభ్యర్థిగా రీటాను జేజేపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. ‘‘అభివృద్ధి, నీటి సమస్యలు, నిరుద్యోగిత వంటి సమస్యలనే ఎన్నికల ప్రచారంలో నా అస్త్రాలుగా చేసుకుంటాను. ఇప్పుడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు బాగానే పనిచేశారు. కానీ చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి’’ అని చెప్పారు. భర్తతో పోటీపై ప్రశ్నించగా.. కాంగ్రెస్‌లో ఆయనకు ఇంకా టికెట్ ఖరారు కాలేదు కాబట్టి దానిపై ఇప్పుడే మాట్లాడబోనన్నారు. మరోవైపు- వీరేంద్ర సింగ్ మాత్రం ఈ ఎన్నికల్లో తనకు, తన భార్యకు మధ్య ప్రత్యక్ష పోరు ఉంటుందని పేర్కొన్నారు.