COVID-19 In India: కోవిడ్19 పాజిటివ్ కేసుల్లో కేరళ పురోగతి, ఒకరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం, మరో ఇద్దరి ఆరోగ్యం మెరుగుపడుతుందని వెల్లడి

ఉత్తర కేరళలోని కాసరగోడ్‌లో మూడవ వ్యక్తి కూడా కరోనావైరస్ పాజిటివ్ అని తేలిన తర్వాత 2020 ఫిబ్రవరి 3న కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో 'హెల్త్ ఎమర్జెన్సీ'ని ప్రకటించింది....

Coronavirus in India (Photo Credits: IANS)

Alappuzha, February 14: ప్రాణాంతక కోవిడ్19 (కరోనావైరస్) సోకి చైనాలో వేల మంది పిట్టల్ల రాలిపోతుంటే, భారత్ (India) లోని కేరళ (Kerala) మాత్రం అద్భుతం సాధించింది. భారత్‌లో తొలి Coronavirus పాజిటివ్ కేసు కేరళలో నమోదైన విషయం తెలిసిందే, ఆ తర్వాత మరో రెండు పాజిటివ్ కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. అయితే ముగ్గురు రోగులలో ఒకరిని అలప్పుజలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.

కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె.కె.శైలాజ (KK Shailaja) మాట్లాడుతూ, రోగికి చికిత్స పూర్తయిన తర్వాత మరో వారం రోజుల పాటు అతడికి కరోనావైరస్ నిర్ధారణ టెస్టులు నిర్వహించాం, ఈ వారం రోజుల రిపోర్టులు అన్ని నెగెటివ్ అని తేలిన తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. రెండో వ్యక్తి కూడా వచ్చే వారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మూడో వ్యక్తికి ఇంకా చికిత్స జరుగుతుంది, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని మంత్రి వెల్లడించారు.

దీనిపై మరింత సమాచారం చెప్తూ "డిశ్చార్జ్ అయిన వ్యక్తితో నేను ఫోన్‌లో మాట్లాడాను, అతడు మంచి హుషారుతో ఉన్నాడు. కొన్నాళ్ల పాటు ఉండే గృహ నిర్బంధం ముగిసిన తర్వాత నన్ను కలుస్తానని వాగ్ధానం చేశాడు, తనకు ప్రాణం పోసిన వైద్యులకు, సేవలు అందించిన ఆసుపత్రి సిబ్బందికి సెల్యూట్" అని తనతో చెప్పినట్లుగా మంత్రి శైలజ పేర్కొన్నారు. కాగా, ఈ COVID-19 తో చేసిన యుద్ధంలో సగం విజయమే సాధించామని మంత్రి అన్నారు.

త్రిస్సూర్ మెడికల్ కాలేజీలో కరోనావైరస్ బారిన పడిన రెండో పాజిటివ్ కేసు ఓ వైద్య విద్యార్థిని. ఆమె నివేదికలన్నింటినీ పరిశీలించిన తరువాత త్వరలో డిశ్చార్జ్ చేయనున్నట్లు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి తెలిపారు. ఉత్తర కేరళలోని కాసరగోడ్‌లో మూడవ వ్యక్తి కూడా కరోనావైరస్ పాజిటివ్ అని తేలిన తర్వాత 2020 ఫిబ్రవరి 3న కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో 'హెల్త్ ఎమర్జెన్సీ'ని ప్రకటించింది.

ఇదిలా ఉండగా, కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల ఇద్దరు వ్యక్తులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలిందని వచ్చిన వార్తలను అధికారులు ఖండించారు. విమానాశ్రయంలో ఇప్పటివరకు 21,792 మంది ప్రయాణికులకు వైద్యపరీక్షలను నిర్వహించాం, అందులో ముగ్గురు అనుమానితులను ఈ వారం ప్రారంభంలో ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు వెల్లడించారు.

ఇక చైనాలో ఈ వైరస్ బారిన పడి చనిపోయిన మృతుల సంఖ్య 1,367కు చేరింది. అలాగే ఫిబ్రవరి 12వరకు చైనా వ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 59,804కు చేరినట్లు చైనా అధికార వర్గాలు వెల్లడించాయి.