Kerala, February 2: ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనావైరస్ (Coronavirus) భారత్‌లోకి మెల్లిగా పంజా విప్పుతోంది. ఇప్పటికే కేరళలో (Kerala) ఓ కేసు నమోదన ఘటన మరవక ముందే మరో కేసు అక్కడే నమోదైంది. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం అతని ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇతను ఇటీవల చైనాలో (China) పర్యటించి వచ్చినట్లు తెలుస్తోంది. తాజా కేసుతో ఇప్పటి వరకు భారత్‌లో (India) రెండు కరోనా కేసులు నమోదు కాగా రెండూ కూడా కేరళలోనే కావడం ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు కరోనా వైరస్ ప్రభావం వల్ల చైనా వెలుపల ఫిలిప్పీన్స్‌లో తొలి మరణం నమోదైంది.
కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు బట్టబయలు
మూడు రోజుల క్రితం కేరళలోనే తొలి కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. కేరళకు చెందిన ఈ విద్యార్ధిని చైనాలోని వుహాన్ నగరంలో (Wuhan) విద్యాభ్యాసం చేస్తోంది. వైరస్ తీవ్రతకు భయపడి ఆ విద్యార్ధిని స్వస్థలానికి చేరుకోగా, ఆమె రక్త నమూనాలను సేకరించి పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించారు.ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా సోకిన విషయం బయటపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్
చైనాలో పంజావిప్పిన ఘోరమైన నోవల్ కరోనావైరస్ (2019-nCoV) కారణంగా మరణించిన వారి సంఖ్య 304 కి చేరింది. ఆదివారం నాటికి 45 కొత్త మరణాలు రికార్డయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి.
మొత్తం 14,380 కరోనా వైరస్ కేసులు నమోదుకావడంతో 2003లో సార్స్ వైరస్ సోకినవారి కంటే ఇది అధికం.