COVID-19 Tests Free of Cost: ప్రైవేట్ ఆసుపత్రులైనా, ల్యాబ్‌లలోనైనా కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయాల్సిందే, కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన సుప్రీంకోర్ట్
ఒకవేళ ప్రైవేట్ ఆసుపత్రులు లేదా ల్యాబ్‌లు చార్జ్ చేస్తే ఆ బిల్లులు రీఎంబర్స్ చేసుకునేందుకు వీలు కల్పించాలని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది.....
New Delhi, April 9: దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో లేదా ల్యాబ్‌లలో ఎక్కడైనా సరే COVID-19 నిర్ధారణ పరీక్షలు పూర్తి ఉచితంగా (COVID-19 Tests Free of Cost) నిర్వహించాలని భారత ప్రభుత్వానికి సుప్రీంకోర్ట్ (Supreme Court) ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కరోనావైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలపై వైద్య పరీక్షల భారం పడకుండా చూడాలని, అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు తక్షణమే ఆదేశాలివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
కరోనావైరస్ స్క్రీనింగ్ మరియు నిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు లేదా ప్రయోగశాలలకు రూ. 4,500 వరకు చార్జ్ చేసేందుకు వీలుగా ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసింది. అయితే దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశంలో ఒక విపత్కర పరిస్థితులు ఉన్నపుడు ప్రజలపై భారం వేయడం భావ్యం కాదు. పేదవర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే ఇండియా లాంటి దేశంలో అందరి వద్ద రూ. 4,500 ఖర్చు చేసే ఆర్థిక స్తోమత ఉండదు. అంతేకాకుండా ఖర్చుకు భయపడే చాలా మంది పరీక్షలు చేసుకోకుండా వెనకడుగు వేస్తారని పిటిషనర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 11న మరోసారి సీఎంలతో పీఎం మోదీ టెలి కాన్ఫరెన్స్, లాక్డౌన్ పొడగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం
దీనిపై విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం కరోనావైరస్ పరీక్షలను NBL గుర్తింపు పొందిన లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఆమోదించిన ఆసుపత్రులు మరియు ల్యాబ్‌లలోనే వైద్యపరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి సూచించింది.
Read The Order Issued by SC:
అలాగే ఈ పరీక్షలను పూర్తి ఉచితంగా నిర్వహించాలి. ఒకవేళ ప్రైవేట్ ఆసుపత్రులు లేదా ల్యాబ్‌లు చార్జ్ చేస్తే ఆ బిల్లులు రీఎంబర్స్ చేసుకునేందుకు వీలు కల్పించాలని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 1,21,271 నమూనాలను పరీక్షించామని ఐసిఎంఆర్ తెలిపింది. ఇందులో 5,247 కేసులు పాజిటివ్ గా నిర్ధారించబడినట్లు పేర్కొంది. అలాగే దేశంలో పరీక్షల సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నట్లు ఐసిఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది.