PM Narendra Modi | File Photo

New Delhi, April 8: దేశంలో కరోనావైరస్ (Coronavirus  Outbreak in India)  వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ (Lockdown) ఎత్తివేయడం కుదరకపోవచ్చునని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Naredra Modi) అన్నారు. బుధవారం అఖిల పక్షం నేతలతో (All Party Meet) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయిన మోదీ, దేశంలోని తాజా పరిస్థితులపై వారితో చర్చించారు.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం COVID-19 యొక్క కఠినమైన సవాలును ఎదుర్కొంటుందని, నేటి పరిస్థితి మానవజాతి చరిత్రలో వేగంగా రూపాంతరం చెందుతున్న దశ అని, దీని ప్రభావాన్ని ఎదుర్కోవడానికి మనం కూడా పరిస్థితులకు తగినట్లు మారాలి అని మోదీ అన్నారు.

దేశంలో సామాజిక అత్యవసర స్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో వర్క్ కల్చర్, వర్కింగ్ స్టైల్ మార్చాల్సిన అవసరం ఉంది. కోవిడ్-19 తర్వాత దేశంలో పరిస్థితులు మునిపటిలా సాధారణంగా ఉండవు. కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్నట్లుగా ఉంటుంది. సామాజిక, వ్యక్తిగత మార్పులు రావాల్సిన అవసరం ఉంది అని మోదీ అఖిలపక్ష నేతలతో పేర్కొన్నారు.

ఒక్కసారిగా లాక్డౌన్ ఎత్తివేయడం కుదరకపోవచ్చునని, దశల వారీగా ఈ లాక్డౌన్ నుంచి ఎలా బయటకు రావాలో సూచనలు చేయాల్సిందిగా వారితో కోరారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్డౌన్ పొడగింపుపై కోరుతున్నాయి. దీనిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతామని ప్రధాని తెలిపారు. ఏదేమైనా లాక్డౌన్ ముగించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.   భారత్‌లో కోవిడ్-19 అంతం ఎప్పుడు? లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అంశంలో కేంద్రం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటి? 

ఈ క్రమంలో ఏప్రిల్ 11న మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. అనంతరం లాక్డౌన్ కొనసాగింపుపై కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ పోరాటంలో కేంద్రంతో కలిసి పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల కృషిని ఆయన ప్రశంసించారు. ఈ యుద్ధంలో ఐక్య కార్యాచరణను అమలు చేయడానికి అన్ని రాజకీయ వర్గాల కలిసి రావడం ద్వారా నిజంగా దేశం ఒక నిర్మాణాత్మక మరియు సుహృద్భావ రాజకీయాలను చూసిందని మోదీ పేర్కొన్నారు.

ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నంలో దేశంలో ప్రతి పౌరుడు చూపిస్తున్న క్రమశిక్షణ, అంకితభావం, లాక్డౌన్ అనుసరణలో నిబద్ధత ప్రశంసనీయమని మోదీ అన్నారు.

ఈరోజు ప్రధాని నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ అజాద్, ఎన్సీపీ నేత శరద్ పవార్ లతో పాటు లోకసభ, రాజ్యసభ నుంచి పలువురు ఎంపీలు, వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు.