COVID-19 Vaccination Drive: మూడు కోట్ల మందికి తొలి దశలో వ్యాక్సిన్, జనవరి 16 నుంచి ప్రారంభం, దేశంలొ అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ
ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ తొలిదశలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఆరోగ్య సంరక్షణ కార్మికులకు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది.
New Delhi, January 9: భారతదేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌గా పేర్కొంటున్న కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ (COVID-19 Vaccination Drive in India) ఈనెల 16న ప్రారంభమవుతోంది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ తొలిదశలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఆరోగ్య సంరక్షణ కార్మికులకు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. ఇందులో భాగంగా 3 కోట్ల మందికి వ్యాక్సిన్ (COVID-19 Vaccination Drive) అందించనున్నారు. ఆ తరువాత 50 ఏళ్లు పైబడిన వారికి, తీవ్ర అనారోగ్యంతో ఉన్న 50 ఏళ్లలోపు వారికి టీకా వేయనున్నారు. వీరి సంఖ్య 27 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
పండుగ సీజన్ కావడం, సంక్రాతి, పొంగల్, మాఘ్ బిహు తదితర పండుగలను కూడా పరిగణనలోకి తీసుకుని జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించాలని మోదీ (PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. పంపిణీపై ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష నిమిత్తం నిర్వహించిన సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌభ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశాలిచ్చారు.
అన్నిరాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో కరోనా టీకా పంపిణీ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. డ్రై రన్ అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. కోవిడ్-19ను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్న మన సాహసులైన డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు, సఫాయి కార్మికులకు తొలి ప్రాధాన్యతా క్రమంగా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్టు చెప్పారు.
అలాగే ప్రభుత్వ అధికార కోవిన్ యాప్ (డిజిటల్ ప్లాట్‌ఫాం) ద్వారా టీకా ప్రక్రియను సమీక్షించనున్నారు. టీకా లబ్ధిదారులను ప్రామాణీకరించడానికి ఆధార్ నంబర్లను ఉపయోగించకుంటామనీ, టీకా లభ్యమయ్యే తేదీ సమయం వివరాలతో వారి,వారి మొబైల్ ఫోన్లకు కనీసం 12 భాషలలో టెక్ట్స్‌సందేశాలను పంపుతామని ప్రభుత్వం తెలిపింది.
మొదటి దశలో సుమారు 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించాలని భుత్వం యోచిస్తోంది. అయితే ఈయాప్ ఇంకా ప్రారంభం కాలేదు. కాగా దేశంలో అత్యవసర ఉపయోగం కోసం రెండు టీకాలను ఇటీవల ప్రభుత్వం ఆమోదించింది. వీటిలో ఒకటి భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాక్సిన్ కాగా రెండవది ఆస్ట్రాజెనెకా,ఆక్స్‌ఫర్డ్ డెవలప్‌చేసిన కోవీషీల్డ్. కోవిషీల్డ్ టీకాను పూణేకు చెందిన సీరం తయారు చేస్తున్నసంగతి తెలిసిందే.