XE Variant of Covid-19: కొత్త వైరస్ ఎక్స్‌ఈ నిజంగానే ఇండియాకు వచ్చిందా, ఇంకా అధికారికంగా ధృవీకరించని కేంద్ర ఆరోగ్యశాఖ, NIB రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం
ముంబైలో 50 ఏండ్ల మహిళకు ఎక్స్‌ఈ వేరియంట్ (XE Variant of Covid-19) సోకినట్టుగా నిర్ధారణ అయిందని..ఈ మేరకు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) బుధవారం ప్రకటన విడుదల చేసింది.
Mumbai, April 6: కరోనా కొత్త వేరియంట్ ‘ఎక్స్‌ఈ’ ఇండియాలోకి ప్రవేశించిందనే వార్తలు గుప్పుమన్నాయి. ముంబైలో 50 ఏండ్ల మహిళకు ఎక్స్‌ఈ వేరియంట్ (XE Variant of Covid-19) సోకినట్టుగా నిర్ధారణ అయిందని..ఈ మేరకు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) బుధవారం ప్రకటన విడుదల చేసింది. గ్లోబల్ జెనోమిక్ డాటా ప్రకారం.. అది ఎక్స్‌ఈ అని తేల్చేసింది కూడా. కానీ.. కేంద్ర ఆరోగ్య సంస్థ ఇండియన్ సార్స్ కోవ్-2 జెనోమిక్స్ కాన్సోర్టియమ్ మాత్రం అది ఎక్స్‌ఈ (Covid XE' Variant of COVID-19) కేసు కాదని కొట్టిపారేసింది.
బీఎంసీ అభ్యర్థన నేపథ్యంలో.. మరో దఫా ఆ శాంపిల్స్‌ను పరిశీలించాలని భావిస్తోంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జెనోమిక్స్‌కు శాంపిల్స్‌ను పంపించింది. ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఈలోపే ముంబైలో తొలి ‘ఎక్స్‌ఈ’ కేసు నమోదు అయ్యిందని ప్రకటించడాన్ని కేంద్ర ఆరోగ్య సంస్థలు తప్పుబడుతున్నాయి. అది ఎక్స్‌ఈ కేసుగా ఇంకా ధృవీకరణ కాలేదని కేంద్ర ఆరోగ్య సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రకటనను ఇన్సాకాగ్ ఖండించింది. జన్యువిశ్లేషణలో ఎక్స్‌ఈ వేరియంట్ కనిపించలేదని పేర్కొన్నది. ముంబైలో సెరో సర్వేలో భాగంగా 376 మందికి నిర్వహించిన పరీక్షల్లో 230 మందికి కరోనా నిర్ధారణ కాగా అందుల్లో 228 మందికి ఒమిక్రాన్ సోకడం గమనార్హం.
కేంద్రం సూచనల మేరకు.. బీఎంసీ అధికారులు సైతం నివేదికలు వచ్చేదాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ‘‘తొలుత మేం ఆ శాంపిల్‌ను ఎక్స్‌ఈ కేసుగానే భావించాం. కానీ, జీనోమిక్ పిక్చర్‌తో అది సరిపోలకపోవడంతో ఎందుకైనా మంచిదని మరోసారి టెస్టులకు పంపించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు ఈ పాటికే దాని ప్రభావం చూపాల్సి ఉందని, ప్రస్తుతానికి భారత్‌లో ఎక్స్‌ఈ కేసులు నమోదు అయినట్లు తాము భావించడం లేదని ఆయన అంటున్నారు. ఇక మహారాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి రాజేష్ (Maharashtra Health Minister Rajesh Tope) దీనిపై స్పందించారు. ఈ వైరస్ ను కేంద్ర ఆరోగ్య శాఖ ఇంకా ధృవీకరించలేదని, శాంపిల్స్ టెస్టింగ్ కు పంపించామని రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
Here's ANI Tweet
యాభై ఏళ్ల వయసున్న సౌతాఫ్రికన్ మహిళ.. ఫిబ్రవరి 10వ తేదీన భారత్‌కు వచ్చారు. ఫిబ్రవరి 27న ఆమెకు కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను ఓ హోటల్ గదిలో క్వారంటైన్‌లో ఉంచారు. ఆపై శాంపిల్‌ను కస్తూర్బా ఆస్పత్రి లాబోరేటరీకి జీనోమ్‌సీక్వెన్సింగ్ కోసం పంపించారు. అందులో ఎక్స్‌ఈ వేరియెంట్‌గా నివేదిక రావడంతో ముంబై అధికారులు ప్రకటన చేశారు.కాగా ఆమెకు స్వల్పలక్షణాలే ఉండగా.. మరోసారి టెస్ట్ నిర్వహించినప్పుడు నెగెటివ్‌గా తేలిందంట. ఆ తర్వాత మరోసారి టెస్టులు నిర్వహించడంతో పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ఆమె.. ప్రస్తుతం కోలుకుని ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ఎక్స్‌ఈ వేరియెంట్.. ఒమిక్రాన్ స్ట్రెయిన్‌లు బీఏ.1, బీఏ.2ల మ్యూటెంట్ వేరియెంట్. జనవరి 19న ఈ ఒమిక్రాన్ మ్యూటెంట్ వేరియెంట్ తొలి కేసును యూకేలో గుర్తించారు. ప్రస్తుతం అక్కడ ఈ వైరస్ కరోనా విజృంభణకు కారణం అవుతోంది.
ఎక్స్‌ఈ వేరియంట్‌ను మొదటగా యూకేలో జనవరిలో గుర్తించారు. ఒమిక్రాన్‌లోని బీఏ.1, బీఏ.2 సబ్ వేరియంట్లు కలిసి ఇది ఏర్పడింది. అందుకే దీన్ని హైబ్రిడ్ వేరియంట్ అని కూడా పిలుస్తున్నారు. కరోనా వేరియంట్లు అన్నింట్లోకెల్లా ఎక్స్‌ఈ అత్యంత వేగంగా (10% More Infectious Than Omicron) వ్యాపించగలదని డబ్ల్యూహెచ్‌వో ఇటీవల హెచ్చరించింది. ఇప్పటివరకు అత్యంత వేగవంతమైనది అని భావిస్తున్న ఒమిక్రాన్ బీఏ.2 కన్నా ఎక్స్‌ఈ 10% ఎక్కువ వేగంగా వ్యాపిస్తుందని అంచనా వేసింది. ఈ వేరియంట్ ఇప్పటికే యూకే నుంచి న్యూజిలాండ్, థాయ్‌లాండ్ తదితర దేశాలకు విస్తరించింది. జ్వరం, గొంతు గరగర, గొంతుమంట, దగ్గు, జలుబు, దురద, అజీర్తి దీని లక్షణాలు.