Jharkhand Elephant Kills 16 People: వామ్మో రాక్షస ఏనుగు! 12 రోజుల్లో 16మందిని తొక్కి చంపిన ఏనుగు, జార్ఖండ్‌లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న ప్రజలు, పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధింపు
ఎదురొచ్చిన వారిని చంపేస్తోంది. ఏనుగు భయంతో ఐదు జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు, ఏ సమయంలో ఎనుగు దాడి చేస్తుందోనని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికారులుసైతం అప్రమత్తమయ్యారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.
Ranchi, FEB 22: ఏనుగు బీభత్సం (Elephant Kills) సృష్టిస్తోంది. ఎదురొచ్చిన వారిని చంపేస్తోంది. ఏనుగు భయంతో ఐదు జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు, ఏ సమయంలో ఎనుగు దాడి చేస్తుందోనని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికారులుసైతం అప్రమత్తమయ్యారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఝార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో అయిదు జిల్లాలైన హజారీబాగ్, రామ్‌గఢ్, చతరా, లోహర్‌దగా, రాంచీ (Ranchi) జిల్లాల్లో ప్రజలను ఏనుగు హడలెత్తిస్తోంది. ఈ ఏనుగు బీభత్సంతో 12 రోజుల్లో 16 మంది చనిపోయారు. ఏనుగు దాడిలో మరణించిన కుటుంబాలకు రూ. 4లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఝార్ఖండ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శశికుమార్ సామంతా తెలిపారు.
అయితే, ఏనుగును అడవుల్లోకి తరలించేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి నిపుణుల బృదాన్ని రప్పిస్తున్నట్లు తెలిపారు. ఏనుగు భారినుండి మరింత ప్రాణనష్టం నివారించడానికి అధికారులు ఆయా జిల్లాల్లో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడవద్దని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
ఏనుగు మంగళవారం ఒక్కరోజే రాంచీ జిల్లాలో ఇద్దరు మహిళలు సహా నలుగురిని చంపడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సోమవారం లోహర్‌దగా జిల్లాలో ఇద్దరు మహిళలపై ఏనుగు దాడిచేసి హతమార్చింది. అంతకుముందు రోజు ఆదివారం ఒకరిని తొక్కి చంపించిందని అధికారులు తెలిపారు. 12 రోజుల క్రితం ఇదే ఏనుగు హజరీబాగ్ లో ఐదుగురిని చంపి, ఆపై రామ్‌ఘర్‌కు వెళ్లి అక్కడ గోలా ప్రాంతంలో ఒక వ్యక్తిని తొక్కి చంపినట్లు రాంచీ డీఎఫ్‌ఓ తెలిపారు. మొత్తం 12 రోజుల నుంచి ఈ ఏనుగు ఏకంగా 16 మందిపై దాడిచేసి వారి చావుకు కారణమైందని అధికారులు తెలిపారు. ఝార్ఖండ్ లో ఏనుగులు దాడి చేయటం గత కొన్నేళ్లుగా పెరిగాయి. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2017 నుంచి అయిదేళ్లలో 462 మంది ఏనుగుల దాడుల్లో మరణించారు.