Cyclone Mandous: రాత్రికి తీరం దాటనున్న తుపాను, స్కూళ్లు, పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు, మూడు రోజలు పాటు భారీ వర్షాలు

దాంతో భారత వాతావరణ కేంద్రం అధికారులు తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు.

Representational Image (Photo Credits: PTI)

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్‌ తుఫాను ఇవాళ తెల్లవారుజామున తీవ్ర తుఫాన్‌గా రూపు మార్చుకుని తీరం వైపు దూసుకొస్తోంది. దాంతో భారత వాతావరణ కేంద్రం అధికారులు తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. చెన్నై సహా చంగల్పట్టు, కాంచీపురం, విలుప్పురం, కొడలూర్‌, రాణీపేట్‌, వెల్లూర్‌, తిరువల్లూరు తదితర జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టింది.

ఏపీలో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తుపాను హెచ్చరికలతో ముందస్తు చర్యలు తీసుకున్నామని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించాం. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించి వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎండీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వెల్లడించారు.

తీవ్ర తుఫానుగా మారిన మాండూస్.. నేడే తీరం దాటే అవకాశం.. ఏపీలో భారీ వర్షాలు.. అధికారుల అలర్ట్

తిరుపతి జిల్లాలో నేటి మధ్యాహ్నం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించామని జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మాండూస్ తుఫానుగా మారిన నేపథ్యంలో నేటి మధ్యాహ్నం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనంతరం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవుగా ప్రకటంచామన్నారు.సంబంధిత పాఠశాలలు కళాశాలలు వాటి యాజమాన్యాలు తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించాలని లేనిచో కఠిన చర్యలు ఉంటాయని ఆదేశాలు జారీ చేశారు.

శ్రీహరికోట వైపు దూసుకొస్తున్న మాండూస్ తుఫాన్, అధికారులను అప్రమత్తం చేసిన సీఎం జగన్, నేడు అర్థరాత్రి కోస్తాంధ్ర, తమిళనాడుపై విరుచుకుపడే అవకాశం

తుఫాను మండూస్‌ ప్రస్తుతం కరైకల్‌కు 240 కిలోమీటర్లు, చెన్నైకి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి వాయవ్య బంగాళాఖాతం వైపు కదులుతున్న మండూస్‌ తుఫాను.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. తర్వాత శుక్రవారం అర్ధరాత్రికి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్యలో మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం పశ్చిమ వాయవ్యంగా పయనించి శనివారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడుతుందని వెల్లడించింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

తుఫాను నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా, ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా, ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల మోస్తరు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.