Cyclone Sitrang Update: తీరాన్ని తాకిన సిత్రాంగ్ తుఫాన్, బంగ్లాదేశ్,పశ్చిమ బెంగాల్‌లో సైక్లోన్ బీభత్సం, గంటకు 100 కిలో మీటర్ల వేగంతో గాలులు, ఏడుగురు మృతి
దక్షిణ పశ్చిమ బెంగాల్ జిల్లాల్లో ఉదయం నుంచి వాతావరణం మెరుగుపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
New Delhi, Oct 25: పశ్చిమ బెంగాల్ తీరాన్నివణికించిన తర్వాత సిత్రంగ్ తుఫాను బారిసల్ సమీపంలో బంగ్లాదేశ్ లో తీరాన్ని దాటినట్లు IMD మంగళవారం తెలిపింది. దక్షిణ పశ్చిమ బెంగాల్ జిల్లాల్లో ఉదయం నుంచి వాతావరణం మెరుగుపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
ఉత్తర బంగాళాఖాతం నుండి గంటకు 56 కి.మీ వేగంతో బంగ్లాదేశ్ వైపు కదులుతున్న ఈ తుఫాను ప్రభావంతొ.. ఉత్తర, దక్షిణ 24 పరగణాల ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నాటికి గంటకు 100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. సిత్రాంగ్ తుఫాను ఉత్తర-ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతున్నందున కోల్‌కతాతో సహా పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ జిల్లాలు తేలికపాటి నుంచి భారీ వర్షం కురస్తుందనీ, రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది.
సోమవారం రాత్రి 9.30 నుండి 11.30 గంటల మధ్య బంగ్లాదేశ్‌లోని బరిసాల్ సమీపంలోని టింకోనా ద్వీపం మరియు శాండ్‌విప్ మధ్య సిత్రంగ్ ల్యాండ్‌ఫాల్ చేసిందని, గంటకు 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని కోల్‌కతాలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను కారణంగా పొరుగు దేశంలోని ఆగ్నేయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది. ఇది మంగళవారం సాయంత్రానికి అల్పపీడనంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది.
సాగర్ ద్వీపానికి దక్షిణంగా 430 కిలోమీటర్ల దూరంలో తుఫాన్, కోస్తా జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
మంగళవారం ఉదయం పశ్చిమ బెంగాల్ తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, క్రమక్రమంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కార్యాలయం హెచ్చరించింది.
ఇక సిత్రాంగ్ తుఫాన్ బంగ్లాదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ బీభత్సానికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం బంగ్లాదేశ్ లో 2.19 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాక్స్ బజార్ తీరం నుంచి వేల మందిని పునారావాస కేంద్రాలకు తరలించారు. 576 షెల్టర్లను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అవసరమైతే విద్యాసంస్థలనూ పునారావాస కేంద్రాలుగా మారుస్తామని కాక్స్ బజార్ డిప్యూటీ కమిషనర్ రషీద్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు రోజుల పాటు పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలండ్, మిజోరాం రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సిత్రాంగ్ ముప్పు ఏపీపై లేనప్పటికీ చలి తీవ్రత మాత్రం పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోనూ చలి తీవ్రత పెరిగింది.
పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాన్ని సూచిస్తూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మధ్య బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నందున అనవసరంగా బయటకు వెళ్లవద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సిత్రాంగ్ తుఫాన్‌పై ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. అక్టోబరు 25న వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని.. అనవసరంగా బయటకు వెళ్లడం లేదా సుందర్‌బన్స్‌తో సహా సముద్ర ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తుఫాను ఉత్తర బంగాళాఖాతం నుండి గంటకు 56 కిలో మీటర్ల వేగంతో బంగ్లాదేశ్ వైపు కదులుతుందనీ, దీని కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, తీరప్రాంత జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే, దక్షిణ బెంగాల్ తీర రేఖపై తుఫాను ప్రభావం ఊహించిన దాని కంటే చాలా తక్కువగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే, సోమవారం సాయంత్రం నుండి వర్షం ఆగిపోయింది. గాలి వేగం కూడా సాధారణమైనదిగా నమోదైంది. దక్షిణ బెంగాల్‌లోని ఉత్తర ప్రాంతాలు మంగళవారం ఉదయం వరకు తేలికపాటి వర్షంతో మేఘావృతమై ఉండవచ్చు. వాతావరణ శాఖ ప్రకారం, సిత్రాంగ్ తుఫాను కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.