
Lahore, FEB 28: కీలకమైన అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా (AFG Vs AUS) మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా అటల్ (85), అజ్మతుల్లా ఒమర్జాయ్ (67) రాణించారు. 274 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 12.5 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 109 పరుగులు చేసింది. ఆ సమయానికి ట్రావిస్ హెడ్ 59, స్టీవ్ స్మిత్ 19 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో నిలిచారు. సరిగా అప్పుడే చినుకులు ప్రారంభమయ్యాయి. అంపెర్లు ఆటను నిలిపివేశారు. తర్వాత వర్షం కాస్త పెద్దదైంది. అనంతరం వాన ఆగిపోయినా ఔట్‌ఫీల్డ్‌లో భారీగా నీళ్లు నిలిచిపోయాయి.
నిర్ణీత సమయంలోగా ఔట్‌ఫీల్డ్ సిద్ధం కాకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఆసీస్, అఫ్గానిస్థాన్‌కు చెరో పాయింట్ కేటాయించారు. గ్రూప్ బి నుంచి నాలుగు పాయింట్లతో అస్ట్రేలియా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. మూడు పాయింట్లతో అఫ్గానిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.