Delhi Shocker: డాన్‌గా ఎదగాలని షాపు యజమానిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన మైనర్లు, రూ. 500 నోటు చెల్లదనడంతో కిరాతకానికి పాల్పడిన నలుగురు
రూ.500 నోటుపై గొడవతో ఒక షాపు యజమానిని నలుగురు మైనర్ బాలురు కిరాతకంగా హత్య (4 Minors Kill Shop Owner) చేశారు.
New Delhi, August 20: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన (Delhi Shocker) జరిగింది. రూ.500 నోటుపై గొడవతో ఒక షాపు యజమానిని నలుగురు మైనర్ బాలురు కిరాతకంగా హత్య (4 Minors Kill Shop Owner) చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భజన్‌పురాలోని సుభాష్ మొహల్లా ప్రాంతానికి చెందిన షాపు ఓనర్ షానవాజ్, గురువారం రాత్రి కత్తిపోట్లకు గురయ్యాడు. అపస్మారకంగా నేలపై పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నలుగురు బాలురు హడావుడిగా స్కూటీపై అక్కడి నుంచి పారిపోవడాన్ని గమనించారు. ఆ మైనర్ బాలురు భజన్‌పురా ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. తనిఖీలు నిర్వహించిన పోలీసులు, భోపురా సరిహద్దు వద్ద ఉత్తరప్రదేశ్‌లోని లోనిలో ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి స్కూటీ, హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు ఆ మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టారు. తామంటే స్థానికుల్లో భయం పుట్టించాలని, నేరగాళ్లుగా పేరు పొందాలని అనుకున్నారు. బుధవారం భజనపురాలోని శని బజార్ రోడ్‌లో ఒక వ్యక్తిని గన్‌తో బెదిరించి స్కూటీని దొంగిలించారు. అయితే 20 రోజుల కిందట షానవాజ్ షాపులో కొన్ని వస్తువులను ఆ బాలురు కొన్నారు.
వారు ఇచ్చిన రూ.500 నోటు ( Soiled Rs 500 Note) చెల్లదని ఓనర్ చెప్పడంతో గొడవ జరిగింది. ఈ సందర్భంగా షానవాజ్‌ను బెదిరించిన బాలురు, అతడికి గుణపాఠం చెప్పాలనుకున్నారు. గురువారం రాత్రి ఆ షాప్ వద్దకు వెళ్లి షానవాజ్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు. ఇదంతా తెలుసుకున్న పోలీసులు నలుగురు మైనర్ బాలురపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.