Delhi Unlock: భారీగా తగ్గిన కరోనా కేసులు, ఢిల్లీలో మే 31 నుంచి అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం, నిర్మాణ రంగ కార్యకలాపాలతో పాటు పరిశ్రమలను తిరిగి తెరవనున్న ఢిల్లీ ప్రభుత్వం, ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం
ఈ నేపథ్యంలో సోమవారం నుంచి దశలవారీగా అన్‌లాకింగ్ ప్రక్రియ (Delhi Unlock Process to Begin from May 31) ప్రారంభం కానుంది. ప్రజలు ఆకలితో చనిపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) ప్రకటన చేశారు.
Delhi, May 29: కరోనావైరస్ కేసులు విశ్వరూపం చూపిన దేశ రాజధానిలో ఇప్పుడు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి దశలవారీగా అన్‌లాకింగ్ ప్రక్రియ (Delhi Unlock Process to Begin from May 31) ప్రారంభం కానుంది. ప్రజలు ఆకలితో చనిపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) ప్రకటన చేశారు. ఇప్పటికే విధించిన లాక్‌డౌన్ సోమవారం ఉదయం ఐదు గంటల వరకు కొనసాగుతుంది.
ఇక అన్‌లాకింగ్ ప్రక్రియను నెమ్మదిగా ప్రారంభించనున్నాం. రోజూవారీ వేతనంపై ఆధారపడి జీవించే కార్మికుల దృష్ట్యా నిర్మాణ రంగ కార్యకలాపాలను, పరిశ్రమలను తిరిగి (Factories, Construction Activiities Allowed for One Week) తెరవనున్నాం. ప్రజలు ఆకలితో చనిపోకుండా చూసేందుకు అన్‌లాక్ (Delhi Unlock) చేయాల్సిన సమయం ఇది’ అని కేజ్రీవాల్ వెల్లడించారు. సోమవారం నుంచి నిర్మాణ కార్యకలాపాలు, ఫ్యాక్టరీలను వారం పాటు అనుమతించి, ఆ తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామన్నారు.
సుమారు నెల రోజుల క్రితం దిల్లీలో విధించిన లాక్‌డౌన్ (Lockdown in Delhi) ఆంక్షలు ఫలితాన్నిచ్చాయి. దాంతో అక్కడ కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒక దశలో 36 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు తాజాగా 1.5 శాతానికి పడిపోయింది. ‘పాజిటివిటీ రేటు 1.5 శాతానికి తగ్గింది. 24 గంటల వ్యవధిలో సుమారు 1,100 కొత్త కేసులు వెలుగుచూశాయి’ అని కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు. కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే ఢిల్లీ తాజా ప్రకటన చేసింది. ఇక, ఇప్పటివరకు దేశ రాజధాని నగరంలో 14,22,549 మందికి కరోనా సోకగా, 23,812 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆక్సిజన్ కొరత కారణంగా ఆసుపత్రుల్లో ప్రాణాలు కోల్పోయిన కొవిడ్ బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల వరకు పరిహారాన్ని అందిస్తామని ప్రకటించింది. ఇందుకు కావాల్సిన విధానాలను రూపొందించేందుకు ఆరుగురు వైద్యలతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కొవిడ్‌తో మరణించిన కుటుంబీకులకు ప్రస్తుతం ఇస్తున్న ₹50వేలకు ఇది అదనం అని ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం పేర్కొంది.
కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందిస్తామని దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా అలాంటి పిల్లలకు 25ఏళ్ల వయసు వచ్చేవరకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. కొవిడ్ కారణంగా భర్త లేదా భార్య కోల్పోయిన వారికి పెన్షన్ అందిస్తామని పేర్కొంది. వివాహం కాని వ్యక్తి మరణిస్తే.. వారి తల్లిదండ్రులకు పెన్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
కరోనా సెకెండ్ వేవ్‌లో దేశరాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య 70 శాతానికి పైగా తగ్గింది. 2021 ఫిబ్రవరి నుంచి ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ 800 విమానాలు నడుస్తున్నాయి. మే నెలలో ఈ సంఖ్య 500కు తగ్గింది. దీనికి కరోనా వ్యాప్తితో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తో సహా మరికొన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేధించడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత ఫిబ్రవరిలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ 800 విమానాలు నడవగా, సుమారు 1.10 లక్షల మంది ప్రయాణాలు సాగించారు. వీరిలో 90 వేల మంది దేశీయ ప్రయాణీకులు, 20 వేల అంతర్జాతీయ ప్రయాణీకులు ఉన్నారు. అయితే కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది.
లాక్డౌన్ పొడిగించిన రాష్ట్రాలు ఇవే
ఉత్తరప్రదేశ్: కరోనా కర్ఫ్యూను వచ్చే నెల మొదటి వారం నుంచి సడలించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నాయి.
మహారాష్ట్ర: లాక్‌డౌన్ తరహా ఆంక్షలను మరో 15 రోజులపాటు పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర వైద్యశాఖమంత్రి రాజేశ్ తోపే తెలిపారు. అయితే జూన్ 1 కొత్త మార్గదర్శకాలు ప్రకటిస్తామని చెప్పారు.
తమిళనాడు: లాక్‌డౌన్‌ను వచ్చే నెల 7 వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం వెల్లడించారు. ప్రజలు సహకరించాలని కోరారు. వచ్చే నెల నుంచి 13 రకాల సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.
నాగాలాండ్: సంపూర్ణ లాక్‌డౌన్‌ను వచ్చే నెల 11 వరకు పొడిగించారు. తొలుత ఈ నెల 14న వారం పాటు లాక్‌డౌన్ విధించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అనంతరం పొడిగిస్తూ వస్తున్నది.
అరుణాచల్ ప్రదేశ్: లాక్‌డౌన్‌ను వచ్చే నెల 7 వరకు పొడిగించారు.