Black Fungus: దేశంలో బ్లాక్ ఫంగల్ కల్లోలం, ఇప్పటివరకు 11,717 కేసులు గుర్తింపు, ఐదు రాష్ట్రాల్లోనే 65శాతం కేసులు, ఆంఫోటెరిసిన్‌-బీ ఇంజెక్షన్లను రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు తెలిపిన సదానంద గౌడ
Fungal infection mucormycosis | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, May 26: దేశం కరోనాతో విలవిలలాడుతుంటే కొత్తగా బ్లాక్ ఫంగస్ (Black Fungus) బెంబేలెత్తిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిపై, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై `మ్యుకర్ మైకోసిస్` అనే ఫంగస్ దాడి చేసి తన ప్రతాపాన్ని చూపెడుతోంది. కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11,717 బ్లాక్ ఫంగస్ కేసులు (India reported 11,717 cases till now) నమోదయ్యాయి. ఇందులో 65శాతం కేసులు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయని పేర్కొంది.

గుజరాత్‌లో అత్యధికంగా 2859 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (2770), ఆంధ్రప్రదేశ్ (768) ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో 620 కేసులు నమోదయ్యాయని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. అయితే, కేంద్రం డేటాలో 120 కేసులు నమోదైనట్లు చూపింది. ఆయా రాష్ట్రాల వారీగా కేసుల వివరాలను కేంద్ర మంత్రి సదానంద గౌడ ట్విటర్ ద్వారా వెల్లడించారు. చికిత్స నిమిత్తం అదనంగా మరో 29,250 అంఫోటెరిసిన్-బి వయల్స్‌ను రాష్ట్రాలకు పంపినట్టు తెలిపారు.

కరోనా కేసులు తగ్గుతున్నా వణికిస్తున్న మరణాలు, తాజాగా 4,147 మంది మృతి, కొత్తగా 2,08,921 మందికి కోవిడ్, గత 24 గంటల్లో 2,95,955 మంది డిశ్చార్జ్, పుదుచ్చేరిలో లక్షకు చేరువైన కరోనా కేసులు

కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్‌ ఫంగస్ ముప్పుగా పరిణమించింది. ఇదేమీ కొత్తవ్యాధి కాకపోయినా.. దీనిబారిన పడినవారికి అతి తక్కువ రోజుల్లోనే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా మన శరీరంలోని రక్షణ వ్యవస్థ ఈ ఫంగల్ వ్యాధిని తిప్పికొడుతుంది. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, క్యాన్సర్ రోగులు, అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకున్నవారు దీని బారినపడే అవకాశం ఎక్కువ.

Here's Sadananda Gowda Tweet

మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని అంటువ్యాధుల చట్టం (ఎపిడెమిక్‌ డిసీజెస్ యాక్ట్‌) కింద పరిగణించాలని కేంద్రం కొద్దిరోజుల క్రితం రాష్ట్రాలను ఆదేశించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు దీన్ని అంటువ్యాధిగా ప్రకటించాయి.

తాజా కేటాయింపులో 29,250 ఇంజెక్షన్లను విడుదల చేయగా.. ఇందులో అత్యధికంగా గుజరాత్‌కు 7,210, ఆ తర్వాత మహారాష్ట్రకు 6,980 వయల్స్‌ను పంపింది. ఏపీకి 1,930, మధ్యప్రదేశ్‌కు 1,910, తెలంగాణ 1,890, ఉత్తరప్రదేశ్‌కు 1,780, రాజస్థాన్ 1,250, కర్ణాటక 1,220, హర్యానాకు 1,110 వయల్స్‌ను అందజేసింది. ఇంతకు ముందు ఈ నెల 24న 19,420 వయల్స్‌ను సరఫరా చేయగా.. ఈ నెల 21న దేశవ్యాప్తంగా 23,680 వయల్స్‌ను సరఫరా చేసింది.