Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ లీడర్ కే కవిత జ్యుడీషియల్ కస్టడీ మే 7 వరకు పొడిగింపు
కవితలకు ఢిల్లీ కోర్టు మంగళవారం జ్యుడీషియల్ కస్టడీని మే 7 వరకు పొడిగించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ నేత కె. కవితలకు ఢిల్లీ కోర్టు మంగళవారం జ్యుడీషియల్ కస్టడీని మే 7 వరకు పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని కోర్టు ముందు సీబీఐ హాజరుపరచగా , ఈడీ వ్యవహారాల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కస్టడీని పొడిగించారు. సీబీఐ విచారిస్తున్న సంబంధిత అవినీతి కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె కవితకు జ్యుడీషియల్ కస్టడీని మే 7 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణను మే 15కి వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు, ఆరోగ్యంపై వేసిన పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం
లిక్కర్ స్కాంలో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా మార్చి 15వ తేదీన తనను అరెస్ట్ చేసిందని, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు వాదనలు వినిపించారు. ఇక లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి(ఏప్రిల్ 24) వాయిదా పడింది. బుధవారం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి. మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గంటన్నర సేపు వాదనలు వినిపించింది.
కేజ్రీవాల్‌ను లిక్కర్ కేసులో మార్చ్ 21న ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. కాగా, తనకు ప్రైవేట్ వైద్యులతో ప్రత్యేక చికిత్స కావాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు ఇప్పటికే కొట్టివేసిన విషయం తెలిసిందే.