Farmers' Hunger Strike: చట్టాలు రద్దు చేస్తారా లేదా? ఆమరణ నిరాహార దీక్షకు దిగిన రైతులు, ఉద్యమానికి మద్ధతుగా పంజాబ్‌ డీఐజీ రాజీనామా,ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒకరోజు నిరాహార దీక్ష

‘చలో ఢిల్లీ’లో భాగంగా ఢిల్లీ–జైపూర్‌ హైవే ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు ఆదివారం మధ్యాహ్నం నుంచి షాజహాన్‌పూర్‌ వద్ద హైవేపైకి చేరుకుంటున్నారు.

Farmers' protest in Delhi | (Photo Credits: PTI)

New Delhi, December 14: కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌పై కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో రైతు సంఘాలు దేశ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునివ్వడంతో పాటు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు (Farmers' Hunger Strike) ప్రకటించారు. ‘చలో ఢిల్లీ’లో భాగంగా ఢిల్లీ–జైపూర్‌ హైవే ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు ఆదివారం మధ్యాహ్నం నుంచి షాజహాన్‌పూర్‌ వద్ద హైవేపైకి చేరుకుంటున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నిలువరిస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం రైతు సంఘాలతో చర్చలకు తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉండాయని చెబుతోంది. ఎప్పుడైనా చర్చలకు రావొచ్చని తెలిపింది.

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల నేతలు సోమవారం ఉద యం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష (Day-Long Fast Against Farm Laws) పాటిస్తారని రైతు సంఘం నేత గుర్నామ్‌ సింగ్‌ చదుని తెలిపారు. దీంతో పాటు సోమ వారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు జరుగుతాయన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు యథాప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

చిల్లా వద్ద రైతు ఆందోళనల విరమణపై ఆయన స్పందిస్తూ.. ‘ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయంటూ కొన్ని గ్రూపుల నేతలు ఆందోళనలను విరమిస్తున్నారు. రైతుల పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. సాగు చట్టాలు మూడింటిని రద్దు చేయాలనే విషయంలో రైతు సంఘాలన్నీ ఏకతాటిపై ఉన్నాయి’అని ఆయన ప్రకటించారు. ఈ నెల 19వ తేదీ నుంచి నిరవధిక దీక్ష చేప ట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు మరో నేత సందీప్‌ గిద్దె తెలిపారు.

కొత్త పార్లమెంట్ భవనం అవసరమా? ముందు దేశ ప్రజల ఆకలి సంగతి చూడండి, ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీపై విరుచుకుపడిన మక్కల్ నిధి మయమ్ అధినేత కమల్ హసన్

కొన్ని రైతు సంఘాలు వ్యవసాయ చట్టాలకు మద్దతు ప్రకటిస్తున్నాయి. వారితో మాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేస్తున్నా. ప్రభుత్వంతో చేతులు కలిపి, వారు మా ఉద్యమానికి వెన్నుపోటు పొడవాలని కుట్రపన్నారని ఆయన మండిపడ్డారు. రైతులు ఢిల్లీకి రాకుండా ప్రభుత్వాలు అడ్డుపడుతున్నాయి. కానీ మా ఉద్యమం ఆగదు. ఉద్యమంలో భాగమైన అన్ని రైతు సంఘాలు ఐక్యంగా ఉన్నాయి’ అని మరో రైతు నాయకుడు శివకుమార్‌ కక్కా పేర్కొన్నారు. సంప్రదింపులకు ప్రభుత్వం మరో ప్రతిపాదన పంపితే, దానిపై ఒక కమిటీ ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకుంటామని రైతు నేత రాకేశ్‌ తికాయత్‌ తెలిపారు.

హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లోని రైతు కుటుంబాలకు చెందిన పలువురు సామాన్య గృహిణులు ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనల్లో చురుగ్గా పాలుపంచు కుంటున్నారు. వ్యవసాయానికి ఆడామగా తేడా లేదు.చాలా మంది పురుషులు ఇక్కడ నిరసనల్లో పాల్గొంటున్నారు. మేమెందుకు ఆందోళనల్లో పాల్గొనకూడదు?’అని వారంటున్నారు.

ఈ నెల 19 నుంచి చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షను రద్దు చేశామని, అందుకుబదులుగా సోమవారం ఒక్కరోజు నిరాహారదీక్ష చేస్తున్నామని మరో నేత సందీప్‌ గిడ్డే చెప్పారు. మరోవైపు, రాజస్థాన్‌లోని షాజహాన్‌పూర్‌ నుంచి ట్రాక్టర్‌ మార్చ్‌ చేపట్టిన రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు ఎన్‌హెచ్‌-8పై ధర్నాకు దిగారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా పోలీసులు మోహరించారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తదుపరి దఫా చర్చల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర మంత్రి కైలాశ్‌ చౌధరి తెలిపారు.

మరింత దూకుడుగా.. డిసెంబర్ 14న రైతుల ఆమరణ నిరాహార దీక్ష, 18వ రోజుకు చేరుకున్న కర్షకుల ఉద్యమం, పోరాటంలోకి తీవ్రవాద శక్తులు ప్రవేశించాయని కేంద్రం ఘాటు వ్యాఖ్యలు, తీవ్రంగా ఖండించిన రైతు సంఘాలు

ఈసారి సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేంద్రం, రైతు ప్రతినిధుల మధ్య ఐదు రౌండ్ల చర్చలు జరిగినా ఎటువంటి పురోగతి కనిపించలేదు. 9వ తేదీన జరగాల్సిన ఆరో విడత చర్చలు రద్దయిన విషయం తెలిసిందే. రైతు ఆందోళనలపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్, సోమ్‌ ప్రకాశ్‌ ఆదివారం హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.

రైతు సంఘాల పిలుపు మేరకు ఆల్వార్‌ జిల్లా షాజహాన్‌పూర్‌ వద్ద జాతీయ రహదారి వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్, హక్కుల కార్యకర్తలు అరుణారాయ్, మేథా పాట్కర్, సీపీఎం నేత ఆమ్రా రామ్‌ తదితరులు వీరిలో ఉన్నారు. రైతుల నిరసనల కారణంగా జైపూర్‌–ఢిల్లీ హైవే ట్రాఫిక్‌ను ఆల్వార్‌ జిల్లా బన్సూర్‌ తదితర మార్గాలకు మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం ఢిల్లీ నుంచి జైపూర్‌కు ఒన్‌వే ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

చిల్లా మీదుగా వెళ్లే నోయిడా– ఢిల్లీ లింక్‌ రోడ్డులోని రవాణా వాహనాలు వెళ్లే ప్రాంతాన్ని రైతులు ఖాళీ చేయడంతో ఆ మార్గంలో రాకపోకలు తిరిగి మొదలయ్యాయి. డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఇక్కడ రైతులు ధర్నా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, నోయిడాలకు కలిపే డీఎన్‌డీ, కాళిందీ కుంజ్‌ మార్గంలో వాహనాల రాకపోకలు నిరాటంకంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు టిక్రీ, ధన్సా సరిహద్దులను మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

పంజాబ్‌ డీఐజీ రాజీనామా

రైతుల ఆందోళనకు మద్దతుగా రాజీనామా చేసినట్లు పంజాబ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(జైళ్లు) లఖ్మీందర్‌ సింగ్‌ జాఖర్‌ ఆదివారం ప్రకటించారు. తన రాజీనా మా లేఖను శనివారం రాష్ట్ర ప్రభుత్వా నికి పంపినట్లు వెల్లడించారు. రైతు కుటుంబానికి చెందిన తను, రైతులు శాంతియు తంగా సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.భారత్‌లో రైతుల ఆందోళనలకు శాంతియుత, న్యాయమైన పరిష్కారాన్ని చూపాలని ఇండియన్‌ అమెరికన్‌ చట్టసభ సభ్యుడు ఆర్‌వో ఖన్నా సూచించారు. రైతుల ఉద్యమం వెనుక పాకిస్థాన్‌, చైనా, మావోయిస్టులు ఉన్నారని కేంద్రమంత్రులు చేసిన ఆరోపణలపై ప్రధాని స్పష్టతనివ్వాలని ఎన్సీపీ డిమాండ్‌చేసింది. రైతులకు మద్దతు తెలిపేందుకు ఢిల్లీ సరిహద్దులకు వెళ్లిన జామియా విద్యార్థులను రైతులు వెనక్కిపంపారు. ఉత్తరాఖండ్‌కు చెందిన పలువురు రైతులు కేంద్రమంత్రి తోమర్‌ను కలిసి కొత్త చట్టాలకు మద్దతిచ్చారు.

అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒకరోజు దీక్ష

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులతో పాటు తానూ సోమవారం దీక్ష చేపట్టనున్నట్టు ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ‘నేనూ నిరాహార దీక్ష చేపడుతా. ఆప్‌ వలంటీర్లు కూడా పాల్గొనాలని విజ్ఞప్తిచేస్తున్నా. రైతుల అన్ని డిమాండ్లు కేంద్రం తక్షణమే అంగీకరించి, మద్దతు ధరలపై బిల్లు తేవాలి. ఉద్యమానికి వేల మంది మద్దతునిస్తున్నారు. ఈ కొత్త చట్టాలు హానికరం. అక్రమార్జనను, అక్రమ నిల్వలను నేరంగా పరిగణించవు. వీటి వల్ల ధరలు పెరుగుతాయి’ అని పేర్కొన్నారు. కేంద్రం అహంకారం వీడి కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను అంగీకరించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళనలను మావో యిస్టులు, వామపక్ష పార్టీలు, జాతి వ్యతిరేక శక్తులు హైజాక్‌ చేశాయంటూ కొందరు కేంద్ర మంత్రులు ఆరోపించడంపై ఎన్‌సీపీ తీవ్రంగా స్పందించింది.

రహదారుల దిగ్బంధంపై 16న సుప్రీం విచారణ

రైతుల నిరసనల కారణంగా వాహ నదారులు ఇబ్బందులు పడుతున్నారనీ, భారీ సంఖ్యలో రైతులు గుమి గూడుతుండటంతో కోవిడ్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటూ దాఖలైన పిటిషన్‌పై ఈనెల 16న సుప్రీంకోర్టు విచారణ చేప ట్టనుంది. ఢిల్లీ సరిహద్దులను తిరిగి తెరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరు తూ వచ్చిన పిటిషన్‌ను ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించనుంది.