New Delhi, December 12: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ పోరు (Farmers' Protest) ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే రహదారుల నిర్బంధానికి పిలుపు ఇచ్చిన రైతు సంఘాలు.. ఇప్పుడు నిరాహారదీక్షకు దిగుతామని మోదీ సర్కారుకు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు జైపూర్-ఢిల్లీ రహదారిని (Jaipur highway,Delhi-Haryana border points) నిర్బంధించడానికి ట్రాక్టర్లతో సిద్ధమయ్యారు. మూడు చట్టాలను పూర్తిగా తొలగించేవరకు తగ్గేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.
ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఆదివారం నుంచి కార్యాచరణ ప్రకటించారు. ట్రాక్టర్లతో రోడ్లను నిర్బంధిస్తామని, ర్యాలీని అడ్డుకోవద్దని చెప్పారు. ఈ నెల 19వతేదీ లోపు తమ డిమాండ్లకు ఒప్పుకోవాలని, 14న నిరాహార దీక్ష చేపడతామని చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష (hunger strike) చేపట్టనున్నట్లు తెలిపారు.
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం 18వ రోజుకు చేరింది. శనివారం రైతులు టోల్ ఫ్లాజాల ముట్టడికి పిలుపుఇవ్వడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని టోల్ ప్లాజాల వద్ద భారీగా బలగాలు మోహరించాయి. నిఘా నీడలో టోల్ ప్లాజాలను కొనసాగించారు. హరియాణాలోని టోల్ ప్లాజాలో వాహనాలను ఫ్రీగా వదిలేశారు. నోయిడాతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా గుండు కొట్టించుకుని నిరసన తెలిపారు.
నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేసేందుకు రైతులు నిర్ణయించడంతో ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో అదనపు సిబ్బందిని ఢిల్లీ పోలీసులు మోహరించారు. నిరసన కార్యక్రమాల వల్ల ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా నిరోధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్ వేదికగా వాహనదారులకు సూచనలు చేస్తున్నారు. ఏయే మార్గాల్లో ప్రయాణించవచ్చునో తెలియజేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
సింఘు బోర్డర్‌లో రైతు నేత కన్వల్‌ప్రీత్ సింగ్ పన్ను శనివారం మాట్లాడుతూ, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ నిరసనను మరింత ఉద్ధృతం చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు జైపూర్-ఢిల్లీ రహదారిపై రాజస్థాన్‌లోని షాజహాన్ పూర్ నుంచి ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ని ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది రైతులు పాల్గొంటారన్నారు. ఇతర ప్రాంతాల రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. రానున్న రోజుల్లో తమ నిరసన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేస్తామన్నారు.
ఇదిలావుండగా, హర్యానాకు చెందిన 29 మంది రైతు నేతలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను శనివారం కలిశారు. నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపారు. ఈ చట్టాలను రద్దు చేస్తే తాము నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని విలేకర్లతో చెప్పారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత 18 రోజులుగా వణికే చలిలో ఢిల్లీ పొలిమేరల్లో ఆందోళన జరుపుతున్న రైతులపై కేంద్రం ఘాటైన విమర్శ చేసింది. రైతుల పోరాటంలోకి మావోయిస్టు, వామపక్ష తీవ్రవాద శక్తులు చొరబడ్డాయని, అది ఇక ఎంతమాత్రం రైతాంగ ఉద్యమం కాదని రైల్వే, వాణిజ్యశాఖల మంత్రి పీయూశ్ గోయెల్ వ్యాఖ్యానించారు. రైతులతో మూడు దఫాల చర్చల్లో ప్రభుత్వం తరఫున పాల్గొన్న గోయెల్ ఈ మాటలనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘మాకిప్పుడు అర్థమవుతోంది. రైతాంగ పోరాటంగా చెబుతున్న ఈ ఆందోళన వారి చేతుల్లో లేదు. జాతి-వ్యతిరేక, అక్రమ కార్యకలాపాలకు పాల్పడినవారిని విడుదల చేయాలన్న డిమాండ్లను చూస్తుంటే అతివాద, మావోయిస్టు-అనుకూల శక్తులు దీన్ని నడిపిస్తున్నారని అర్థమవుతోందని తెలిపారు.
గోయెల్ వ్యాఖ్యలను రైతుల తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమాన్ని ఎవరూ హైజాక్ చేయలేదు. సంయుక్త కిసాన్ యూనియనే అన్ని నిర్ణయాలను తీసుకొంటోంది. మమ్మల్ని ఎవరూ ప్రభావితం చేయలేరు. మమ్మల్ని అప్రదిష్ట పాల్జేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని రైతు నేత రామిందర్ సింగ్ పట్యాల్ అన్నారు. రైతులపై జాతి-వ్యతిరేక ముద్ర వేయడం దారుణమని కాంగ్రెస్ మండిపడింది. రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.