IPL Auction 2025 Live

Farmers' Tractor Rally: ఢిల్లీలో ట్రాక్టర్ కింద పడి రైతు మృతి, తీవ్ర హింసాత్మకంగా మారిన ట్రాక్టర్ల ర్యాలీ, దేశ రాజధానిలో ఇంటర్నెట్, మెట్రో సేవలు బంద్

బారికేడ్లను తొలగించి రైతులు ముందుకు దూసుకుపోవడంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. పలు అడ్డంకులను అధిగమించి రైతులు (Farmers) ఎర్రకోట వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.

Security Personnel Lathi Charge on Protesting Farmers (Photo Credits: ANI)

New Delhi, January 26: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ పరేడ్‌ (Farmers' Tractor Rally) ఉద్రిక్తతలకు దారితీసింది. బారికేడ్లను తొలగించి రైతులు ముందుకు దూసుకుపోవడంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. పలు అడ్డంకులను అధిగమించి రైతులు (Farmers) ఎర్రకోట వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. రైతుల నిరసనలతో ఢిల్లీ (Delhi), దేశ రాజధాని ప్రాంతంలో కొన్ని చోట్ల ఇంటర్‌నెట్‌ సేవలను (Internet) నిలిపివేశారు. ఢిల్లీలో శాంతిభద్రతలు మళ్లీ అదుపులోకి తీసుకువచ్చేందుకే ఈ నిర్ణయమని పోలీసు అధికారులు తెలిపారు.

దీనికి తోడు సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో అదే ట్రాక్టర్ కింద పడి ఓ రైతు మరణించాడు. మృతుడిని ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌కు చెందిన నవనీత్ సింగ్‌గా గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. అయితే ట్రాక్టరు తిరగబడటంతో రైతు చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. మరణించిన రైతుపై జాతీయ జెండా కప్పి ఐటీఓ ఇంటర్ సెక్షన్ వద్ద రైతులు నిరసనకు దిగారు. సదరు రైతు మరణానికి కారణం పోలీసు కాల్పులు జరపడమేనని నిరసన చేస్తున్న రైతులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్‌ను మలుపు తీసుకునే సమయంలో పోలీసులు కాల్పులు జరిపారని, ఆ ప్రమాదంలో రైతు మరణించాడని వారు చెబుతున్నారు.

Here's Farmers Protest Update Visuals: 

వీటన్నిటితో దేశ రాజధానిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఢిల్లీలోని మెట్రో సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. దిల్షన్ గార్డెన్, ఝిల్‌మిల్, మాన్‌సరోవర్ పార్క్, జామా మసీదుతో పాటు ‘గ్రే లైన్’లో ఉన్న అన్ని స్టేషన్లు మూసివేస్తున్నట్లు డీఎంఆర్‌సీ ప్రకటించింది. ఈ వివరాలను డీఎంఆర్‌సీ ట్విటర్ ద్వారా తెలిపింది. మరొక ట్వీట్‌లో, సమయ్‌పూర్ బడ్లీ, రోహిణి సెక్టర్ 18/19, హైదర్‌పూర్ బడ్లి మోర్, జహంగీర్ పురి, ఆదర్శ్ నగర్, ఆజాద్‌పూర్, మోడల్ టౌన్, జీటీబీ నగర్, విశ్వవిద్యాలయం, విధాన సభ, సివిల్ లైన్స్ మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు పేర్కొంది.

దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు, రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, కిసాన్‌ ప‌రేడ్ కోసం ఢిల్లీలోకి ప్రవేశించిన వేలాది మంది రైతులు, మరోవైపు రాజ్‌ప‌థ్‌లో గ‌ణతంత్ర వేడుక‌లు

ఐటీఓ వద్ద రైతులు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో రైతులు తిరగబడ్డారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినా అదుపులోకి రాలేదు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టినా ఢిల్లీ రోడ్లపైకి వేలాది ట్రాక్టర్లు వచ్చేశాయి.  ఎర్రకోటపైకి ఎక్కిన రైతులు తమ జెండాలను ఎగురవేశారు. రైతుల ర్యాలీ హింసాత్మకంగా మారడంతో పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

రైతులు శాంతియుతంగా ట్రాక్టర్‌ పరేడ్‌ను నిర్వహించినా ర్యాలీ సాగాల్సిన రూట్లపై గందరగోళంతో ఇబ్బందులు తలెత్తాయని రైతు సంఘాల నేత రాకేష్‌ తికాయత్‌ అన్నారు. ఇక వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం తక్షణమే వెనక్కితీసుకోవాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.

మరోవైపు ర్యాలీ రూటు మార్పులో తమ పాత్ర ఏదీ లేదని సంయుక్త కిసాన్‌ మోర్చ నాయకులు పేర్కొన్నారు. కొంతమంది అరాచకవాదులు, అసాంఘిక శక్తులు తమ శాంతియుత ఉద్యమంలోకి చొరబడ్డాయని ఆరోపించారు.