Andhra Pradesh: విజయవాడ కొవిడ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది మృతి , పలువురికి గాయాలు, భయంతో పైఅంతస్తుల నుంచి దూకిన మరికొందరు, వివరాలు ఇలా ఉన్నాయి
ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి....
Vijayawada, August 9: కొవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో ఆదివారం తెల్లవారు ఝామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
కరోనా బాధితుల చికిత్స కోసం ఉపయోగిస్తున్న ఈ భవంతిలో మొత్తం 40 మంది ఉన్నట్లు సమాచారం. ఇందులో ఓ 30 మంది వరకు కరోనా బాధితులు కాగా, మిగతా 10 మంది వరకు వైద్య సిబ్బంది అని తెలిసింది. అగ్నిప్రమాదం కారణంగా దట్టంగా పొగలు వ్యాపించడంతో కొంత మంది భయంతో మొదటి అంతస్థు నుంచి కిందకు దూకేశారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లలో చెలరేగిన మంటలు మిగతా ఫ్లోర్లకు కూడా వ్యాపించినట్లు చెబుతున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ జరగడమే కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అందరూ ఘాడ నిద్రలో ఉండటం, అంతటా పొగలు వ్యాపించడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్
కాగా, ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. బాధితుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామి ఇచ్చారు. మృతుల కుటుంబాలకురూ. 50 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను సీం జగన్ ఆదేశించారు.