Forest Fire in J&K's Poonch: భారత్- పాక్ సరిహద్దుల వెంబడి పేలుతున్న ల్యాండ్‌మైన్లు, ఎగిసిపడుతున్న మంటలు, మూడు రోజులుగా కార్చిచ్చు ఆర్పేందుకు తీవ్రయత్నం, ఇప్పటికే పేలిన 12 ల్యాండ్‌మైన్లు
ఈ కార్చిచ్చు ప్రభావంతో జమ్ము-కాశ్మీర్ (Jammu Kashmir), పూంఛ్ జిల్లాలో ఉన్న ల్యాండ్‌మైన్లు పేలుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఎల్‌వోసీ భారత సరిహద్దు ప్రాంతం కావడంతో, పాక్ వైపు నుంచి తీవ్రవాదుల చొరబాట్లు ఉండే అవకాశం ఉంది
Poonch, May 18: నియంత్రణ రేఖ (LOC) వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం అంటుకున్న కార్చిచ్చు, క్రమంగా భారత భూభాగంలోని మెందార్ సెక్టార్‌లోకి (Mendhar sector) చొచ్చుకు వచ్చింది. ఈ కార్చిచ్చు ప్రభావంతో జమ్ము-కాశ్మీర్ (Jammu Kashmir), పూంఛ్ జిల్లాలో(Poonch) ఉన్న ల్యాండ్‌మైన్లు పేలుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఎల్‌వోసీ భారత సరిహద్దు ప్రాంతం కావడంతో, పాక్ వైపు నుంచి తీవ్రవాదుల చొరబాట్లు ఉండే అవకాశం ఉంది. దీంతో చొరబాట్లను నియంత్రించేందుకు ఈ ప్రాంతంలో సైనికులు ల్యాండ్‌మైన్లు (landmine) ఏర్పాటు చేస్తుంటారు. అయితే, కార్చిచ్చు వల్ల చెలరేగిన మంటలతో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ల్యాండ్‌మైన్లు పేలుతున్నాయి. మూడు రోజులుగా దాదాపు 12 ల్యాండ్‌మైన్లు (landmine)పేలినట్లు అధికారులు తెలిపారు. ఈ మంటలను ఆర్పేందుకు ఆర్మీ, ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
బుధవారం ఉదయం మంటలు దాదాపు అదుపులోకి వచ్చినప్పటికీ, వేగంగా వీస్తున్న గాలుల ప్రభావంతో దరమ్‌శల్ (Daramshal) ప్రాంతంలోకి కార్చిచ్చు వ్యాపించింది. రాజౌరి జిల్లాలోని సుందర్ బండి, గంభిర్, నిక్కా, బ్రహ్మణ, మొఘల వంటి అనేక ప్రాంతాల్లో కూడా మంటలు అంటుకున్నాయి. వరుసగా అనేక ప్రాంతాలకు కార్చిచ్చు వ్యాపిస్తోంది. అయితే, మంటలు ఎంతగా చెలరేగుతున్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు.
ముందుజాగ్రత్తగా అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు.