Kodela Passed Away: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కన్నుమూత. ఆత్మహత్యగా అనుమానం. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న హైదరాబాద్ పోలీసులు.
కోడెలపై మరియు ఆయన కుటుంబ సభ్యులపై జగన్ సర్కార్ ఇప్పటివరకూ 15 కేసులు నమోదు చేసిందని, అలాగే కోడెల ప్రతిష్ఠను దిగజార్చేలా వైసీపీ నాయకులు వ్యవహరించడం పట్ల కోడెల శివప్రసాద్ తీవ్ర అవమానంగా....
Hyderabad, September 16: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెలా శివ ప్రసాద్ (Kodela Siva Prasada Rao) సోమవారం ఉదయం హైదరాబాదులోని తన నివాసంలో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన జూబ్లీహిల్స్ లోని బసవతారకం ఆసుపత్రికి తరలించారు. అయితే కోడెలను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే కోడెల మృతిపై నెలకొన్న అనుమానాలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి.
సోమవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత కోడెల శివప్రసాద్ పై అంతస్థులో ఉన్న తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. కొద్దిసేపటికి ఆయనకు కుటుంబ సభ్యులకు ఏదో అనుమానం వచ్చి ఆయన గదికి వెళ్లి చూడగా అప్పటికే ఆయన ప్రాణాపాయ స్థితిలో అచేతనంగా పడిఉన్నారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్సనందించినా ఫలితం లేకుండా పోయింది.
కోడెల మృతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణమని, కోడెల ప్రతిష్ఠను దిగజార్చేలా వైసీపీ నాయకులు వ్యవహరించడం పట్లే కోడెల శివప్రసాద్ తీవ్ర అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నారంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించినట్లుగా కొన్ని మీడియా సంస్థల నుండి వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీ నాయకులు మాత్రం కోడెల మృతికి ఏపి ప్రభుత్వ వేధింపులే కారణమని ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోడెల మరియు ఆయన కుటుంబ సభ్యులపై 14 కేసులు నమోదయ్యాయని. అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో వైసీపీ నాయకులు తనను దొంగగా చిత్రీకరించడం పట్ల కోడెల తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వారు ఆరోపించారు.
పోలీసులు ఏం చెప్తున్నారు?
కోడెల ఉరివేసుకున్నారని, ఆసుపత్రికి తీసుకురాగానే చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు తమకు సమాచారం ఇచ్చారని హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. అయితే కోడెల ఆత్మహత్య చేసుకున్నారా? లేదా అనే విషయాన్ని పోస్టుమార్టం జరిగిన తర్వాత నిర్ధారిస్తామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. కోడెల మృతిపట్ల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.
ఆయన మరణవార్త కలిచివేసిందన్న చంద్రబాబు నాయుడు.
ఏపీ మాజీ స్పీకర్, తెదేపా సీనియర్ నేత అయిన కోడెల శివప్రసాద రావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త కలిచివేసిందని, పార్టీ పరంగా వ్యక్తిగతంగా, మంచి స్నేహితుడిని కోల్పోయినట్లుగా చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోడెల సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు. ఏపీ వ్యాప్తంగా అన్నిచోట్ల కోడెల సంతాప సభలను నిర్వహించాల్సిందిగా పార్టీ శ్రేణులకు అధినేత పిలుపునిచ్చారు.
TDP Chief Chandrababu Tweet:
తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు.
వీరితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర రాజకీయ నాయకులు, ప్రముఖులు కోడెల మృతికి సంతాపం ప్రకటించారు.