Petrol Diesel Price: పెట్రోల్, డీజెల్ ధరలు ఎలక్షన్ తర్వాత లీటరుకు ఏకంగా 12 రూపాయలు పెరిగే చాన్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక..
12 వరకు పెంచాల్సి ఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది.
Petrol Diesel Price: గత నవంబర్ నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచలేదు. దీంతో చమురు కంపెనీలు ఇంధన విక్రయాల వల్ల నష్టపోతున్నాయి. ఇంధనంపై కంపెనీల మార్జిన్ మైనస్‌కు పడిపోయింది. ఒక్కో లీటరు విక్రయానికి రూ.1.54 నష్టం వస్తోంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
చమురు కంపెనీలను నష్టాల నుంచి కాపాడేందుకు మార్చి 16 నాటికి పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 12 వరకు పెంచాల్సి ఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. క్రూడ్ ధరలు గురువారం బ్యారల్ ధర 120 డాలర్లకు చేరుకుంది. గత 9 ఏళ్లలో తొలిసారిగా క్రూడ్ ధర ఈ స్థాయికి చేరుకుంది.
శుక్రవారం క్రూడ్ ధర స్వల్పంగా పతనమైంది. అయినప్పటికీ, ధర, రిటైల్ ధరల మధ్య అంతరం కొనసాగుతుంది. ఇంధన ధరలను తక్షణమే పెంచాల్సిన అవసరం ఉందని ఐసీఐసీఐ నివేదిక పేర్కొంది. మార్చి 16 లోగా ఇంధనం ధరను లీటర్‌కు రూ. 12 పెంచితే కానీ చమురు కంపెనీలకు వచ్చే నష్టం తగ్గదని అంచనా వేసింది. పన్నులతో కలిపి పెట్రోల్, డీజిల్ పై లీటరుకు రూ.15 చొప్పున పెంచాల్సి ఉంటుంది.
JP మోర్గాన్ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీ పెంపు అంచనాలను వ్యక్తం చేసింది. వచ్చే వారం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత డీజిల్, పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతాయని పేర్కొంది. నవంబర్ నుంచి చమురు కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచలేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా కంపెనీలు ధరలు పెంచలేదని భావించింది.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41గా ఉంది. అక్కడ లీటర్ డీజిల్ ధర రూ. 86.67. కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు ధర రూ.100 దాటింది. అయితే, ఖరీదైన ఇంధనం నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి, ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు సుమారు రూ.10 తగ్గించింది.
పెట్రోలు, డీజిల్ ధరల పెంపు ఇతర వస్తువుల ధరలపైనా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. రవాణాకు డీజిల్‌ను ఎక్కువగా వాడడమే ఇందుకు కారణం.