Gold And Silver Prices: పండుగ సీజన్‌లో బంగారం కొంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్, 10 రోజుల్లో ఏకంగా రూ. 2500 తగ్గిన గోల్డ్ ధర, కారణం ఇదే!
దీంతో తులం పసిడి రేటు రూ.58 వేల మార్కు దిగువకు, కిలో వెండి విలువ రూ.74,000 కిందికి చేరాయి. ఈ ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.57,380కి దిగొచ్చింది.
New Delhi, OCT 04: దేశీయ మార్కెట్‌లో గత వారం, పది రోజులుగా పసిడి జిలుగులు (Gold And Silver Prices), వెండి వెలుగులు ఏమీ కనిపించడం లేదు. సాధారణంగా పండుగలు, పెండ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. గోల్డ్, సిల్వర్ మార్కెట్లలో సందడి వాతావరణం నెలకొంటుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఇంకా కానరావడం లేదుమరి. తగ్గుతున్న ధరలకు, పడిపోతున్న డిమాండ్‌కు ఇది అద్దం పడుతున్నది. మున్ముందూ మార్కెట్‌లో ఇదే మందగమనం ఆవరించి ఉంటుందన్న అభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తుండగా, ఇప్పట్లో ధరలు పెరిగే వీలు దాదాపుగా ఉండకపోవచ్చన్న అంచనాలూ కొనుగోలుదారులను వేచిచూసే ధోరణిలోకి నెడుతున్నాయి. ఆగితే ధరలు తగ్గి మరింత లాభాన్ని పొందవచ్చన్న తీరు కస్టమర్లలో ఉంటున్నది.
మంగళవారం బంగారం, వెండి ధరలు భారీగా (Gold And Silver Prices) పడిపోయాయి. దీంతో తులం పసిడి రేటు రూ.58 వేల మార్కు దిగువకు, కిలో వెండి విలువ రూ.74,000 కిందికి చేరాయి. ఈ ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.57,380కి దిగొచ్చింది. 22 క్యారెట్ రేటు సైతం రూ.600 క్షీణించి రూ.52,600లకు పరిమితమైంది. ఇలా గడిచిన పది రోజుల్లో తులం ధర రూ.2,500 వరకు దిగిరావడం గమనార్హం. మరోవైపు కస్టమర్ల ఆదరణ లేక మార్కెట్లో కిలో వెండి ధర కూడా గత పది దినాల్లో రూ.3,000 వరకు తగ్గడం గమనార్హం. మంగళవారం ఒక్కరోజే రూ.2,000 దిగింది. అటు ఢిల్లీ మార్కెట్‌లోనూ 10 గ్రాముల పుత్తడి రూ.650, కిలో వెండి ధర రూ.1,800 చొప్పున క్షీణించాయి.
అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ ధర 1,825 డాలర్ల వద్ద, వెండి ధర 21.10 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. డాలర్ ఇండెక్స్ పెరుగుతున్న నేపథ్యంలోనే గోల్డ్ రేట్లు పడిపోతున్నాయని గ్లోబల్ మార్కెట్ సరళిని నిపుణులు విశ్లేషిస్తున్నారు.