Gold Prices Soar: రూ. 70 వేలు దాటిన 10 గ్రాముల బంగారం ధర, ఇంతలా పసిడి రేట్లు పెరగడానికి కారణాలేంటో తెలుసా..

Gold

దేశంలో బంగారం ధరల జోరు (Gold Price) కొనసాగుతోంది. తాజాగా పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.70 వేల మార్క్‌ను దాటింది. మార్కెట్‌ వర్గాల ప్రకారం.. గురువారం ఉదయం (ఏప్రిల్‌ 4) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారుగా రూ.70,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,750గా ఉంది. ఇక వెండి ధరలు విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.82,000 చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్‌ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు బలపడుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

2004 ఏప్రిల్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.5,800గా ఉంటే అదిప్పుడు రూ.71, 300కు చేరింది. 20 ఏళ్లలో ఇంతలా పెరిగిన ధరలు సోమవారం ఆల్‌టైం రికార్డు ధరలను నమోదు చేశాయి. గతేడాది ఏప్రిల్‌లో అక్షయ తృతీయ రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,400 ఉంది. ఏడాది వ్యవధిలో సుమారు రూ.9000 వరకు పెరిగింది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర, క్రితం రోజుతో పోలిస్తే ఏకంగా రూ.1000 పెరుగుదల

అంతర్జాతీయ మార్కెట్ల ఆధారంగానే బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రధానంగా ఈ ఏడాదిలో వడ్డీరేట్లు తగ్గిస్తామని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటించడం, రూపాయితో పోలిస్తే డాలర్‌ మారకపు విలువ బాగా పెరగడంతో ఇటీవల కాలంలో బంగారం ధరలు పెరిగాయి. మరోవైపు భారత కరెన్సీ రూపాయి మారకం విలువ మరింత పడిపోయి రూ.83లకు వద్ద కొనసాగుతోంది.