Goonga Pahalwan: సాక్షి మాలిక్ కు పెరుగుతున్న మద్దతు, పద్మ అవార్డు వెనక్కు ఇచ్చేందుకు సిద్ధమైన మరో రెజ్లర్
ఈ దేశ బిడ్డ, సోదరి సాక్షి మాలిక్ కోసం పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సాక్షి మాలిక్ ను చూసి గర్వపడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
New Delhi, DEC 24: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌కు విధేయుడు అయిన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ కొత్త అద్యక్షుడిగా ఎన్నికకావడాన్ని పలువురు రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఆటకు రిటైర్‌రెంట్ ప్రకటించగా మరో స్టార్ రెజ్లర్ బజ్‌రంగ పునియా తన పద‌్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సాక్షి మాలిక్‌కు (Sakshi Malik) మద్దతు తెలుపుతూ తాజాగా మరో రెజర్లు వీరేంద్ర సింగ్ కూడా (Goonga Pahalwan) తన పద‌్మశ్రీ అవార్డును వెనక్కి ఇవ్వనున్నట్లు (Return Padma Shri) ప్రకటించారు. ఈ దేశ బిడ్డ, సోదరి సాక్షి మాలిక్ కోసం పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సాక్షి మాలిక్ ను చూసి గర్వపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. దేశంలోని మిగతా అగ్రశేణి క్రీడాకారులు కూడా దీనిపై (వివాదంపై) తమ నిర్ణయాన్ని చెప్పాలని కోరారు.
డబ్ల్యూఎఫ్ఐ వివాదం నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై హరియాణా డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌటాలా స్పందించారు. క్రీడాకారులు ఉద్వేగభరిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. నిర్ణయాలు అనేవి భావోద్వేగాలపై ఆధారపడకూడదన్నారు. న్యాయ బద్దంగా డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు జరిగాయని, ఫలితాలు వచ్చాయన్నారు. ఇప్పుడు క్రీడాకారులు ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదన్నారు.