#HappyBirthdayPMModi: నరేంద్రమోదీ..భారత రాజకీయాల్లో ఓ చెరగని సంతకం, భారత ప్రధాని నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాలపై ప్రత్యేక కథనం

నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అలియాస్ నరేంద్ర మోదీ.. ఈ పేరు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఓ సంచలనం. ఈ సంచలనం వెనుక ఎన్నో గాయాలు, మరెన్నో మరకలు, అయినా వాటికి అదరలేదు, బెదరలేదు, అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. దేశ రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసుకున్నాడు. రెండో సారి దేశ ప్రధానిగా ఎన్నికై సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నాడు. నేడు 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ప్రస్థానం నిజంగా పడి లేచిన కెరటమే..

PM Narendra Modi (Photo Credits: Instagram)

New Delhi,September 17: నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అలియాస్ నరేంద్ర మోదీ.. ఈ పేరు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఓ సంచలనం. ఈ సంచలనం వెనుక ఎన్నో గాయాలు, మరెన్నో మరకలు, అయినా వాటికి అదరలేదు, బెదరలేదు, అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. దేశ రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసుకున్నాడు. రెండో సారి దేశ ప్రధానిగా ఎన్నికై సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నాడు. నేడు 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ప్రస్థానం నిజంగా పడి లేచిన కెరటమే..

నరేంద్ర మోదీ బాల్యం, చదువు: ఒక సామాన్య చాయ్ వాలా భారత ప్రధానిగా ఎదగడం మామూలు విషయం కాదు. ఆయన జర్నీ అంత సింపుల్ గా ఏమీ సాగలేదు. 1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో నరేంద్ర మోడీ జన్మించారు. తల్లి తండ్రులు శ్రీమతి హీరాబా మోడీ, శ్రీ దామోద‌ర్ దాస్ మోడీ. వీరికి ఆరుగురు సంతానం కాగా అందులో మూడ‌వ వారు న‌రేంద్ర మోడీ. మోడీ 1967 వ‌ర‌కు వాద్‌న‌గ‌ర్‌లోనే హ‌య్య‌ర్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ పూర్తి చేశారు. ఆ త‌రువాత 1978లో యూనివ‌ర్సిటీ ఆఫ్ ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ నుంచి పొలిటిక‌ల్ సైన్స్‌లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ పొందారు. ఆ త‌రువాత 1983లో గుజ‌రాత్ యూనివ‌ర్సిటీ నుంచి డిస్ట‌న్స్‌లో పొలిటిక‌ల్ సైన్స్‌లో మాస్ట‌ర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పొందారు.

 చిన్నతనంలో ఎన్నో కష్టాలు: న‌రేంద్ర మోదీ బాల్యం పూల పాన్పు కాదు. స‌మాజంలోని అట్ట‌డుగు వ‌ర్గాల నుండి వ‌చ్చిన కుటుంబం కావ‌డంతో జీవితం గ‌డ‌వ‌డానికి ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డారు. కుటుంబం మొత్తం ఒక చిన్న ఇంట్లో ఉండే వారు. మోడీ తండ్రి స్థానిక రైల్వే స్టేష‌న్‌లో ఏర్పాటు చేసుకొన్న‌ టీ స్టాల్‌లో టీ ని విక్ర‌యించే వారు. చిన్న‌ప్పుడు నరేంద్ర మోడీ త‌న తండ్రి ఏర్పాటు చేసిన టీ స్టాల్‌లో ఆయ‌న‌కు సహాయ‌ప‌డుతూ ఉండేవారు. ఆ త‌రువాత అక్క‌డే సొంతంగా టీ స్టాల్‌ను మోడీ ఏర్పాటు చేసుకుని న‌డిపాడు. అందుకే ఆయన ఛాయ్ వాలా అయ్యారు.

సాధించాలనే పట్టుదల ఎక్కువ: న‌రేంద్ర మోదీ త‌న తండ్రికి స‌హాయ‌ప‌డుతూనే చ‌దువును ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌లేదు. తండ్రికి స‌హాయ‌ప‌డ‌డం, చ‌దువు తో పాటు ఇత‌ర కార్య‌క‌లాపాల‌ను కూడా చురుకుగా చేసేవారు. చ‌దువు, వ‌క్తృత్వం ప‌ట్ల ఆస‌క్తి, దేనినైనా సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌ గ‌ల వ్య‌క్తిగా న‌రేంద్ర మోడీని ఆయ‌న చిన్న‌నాటి మిత్రులు గుర్తు చేసుకుంటారు. పాఠ‌శాల గ్రంథాల‌యంలో గంట‌ల‌ కొద్తీ పుస్త‌కాలు చ‌దువుతూ ఉండేవారు. ఇక క్రీడ‌లలోనూ వారికి ఎంతో ఆస‌క్తి ఉండేది. ఈత అంటే నరేంద్ర మోడీకి చాలా ఇష్టం. ఆయ‌న‌కు ఇరుగు పొరుగున ఎంతో మంది ముస్లిం మిత్రులు ఉండేవారు. వారితో హిందూ, ముస్లిముల పండుగ‌లను జ‌రుపుకొనేవారు.

విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు: అయితే స్కూల్‌, కాలేజీ రోజుల్లోనే మోదీ అప్ప‌టి దేశ ప‌రిస్థితులు, రాజ‌కీయాలు, ఇత‌ర అంశాల‌పై త‌న తోటి విద్యార్థులతో నిర్వ‌హించే డిబేట్ల‌లో అన‌ర్గ‌ళంగా మాట్లాడేవారు. ఆయ‌నకు ఆ ప‌రిజ్ఞానం బాగానే ఉండేది. అన్ని అంశాల‌పై ఆయ‌న బాగా అవ‌గాహ‌న క‌లిగి ఉండేవారు. అలాగే స్కూల్ రోజుల్లో వేసిన ప‌లు నాట‌కాల్లోనూ ఆయ‌న రాజ‌కీయ నాయ‌కుల పాత్ర‌ల‌లో మెప్పించారు. దీంతో ఆయ‌న‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని అధ్యాప‌కులు అప్ప‌ట్లోనే గ్ర‌హించారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్‌)లో మొద‌ట‌గా చేరి, అటు నుంచి బీజేపీలో సాధార‌ణ కార్య‌క‌ర్త స్థాయి నుంచి కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించే ప‌ద‌వుల్లో చేరి.. ఆ త‌రువాత గుజ‌రాత్ సీఎం అయి, అక్క‌డి నుంచి.. దేశ రాజ‌కీయాల వైపు మ‌ళ్లి ప్రధాని అయ్యారు.

గుజరాత్ సీఎంగా.. : 2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన..2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. వరుసగా మూడు సార్లు గుజరాత్ సీఎంగా గెలిచి హ్యాట్రిక్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. అలాగే 2012 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.

గోద్రా అల్లర్ల మరకలు: 2002లో మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోద్రా అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 27, 2002న గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌పెస్ ఎస్-6లో చెలరేగిన మంటల్లో 59 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన అనంతరం గుజరాత్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. మతకల్లోలాలు దావానలంలా వ్యాపించాయి. దాడులు, ప్రతిదాడులు, మారణాయుధాలతో వీధుల్లో స్వైరవిహారాలు, సజీవ దహనాలతో 150 పట్టణాలు, వేలాది గ్రామాలు అల్లకల్లోలమయ్యాయి. వెయ్యి మందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలయింది.స్వాతంత్య్రానంతరం మతకలహాల ముసుగులో జరిగిన పెను విధ్వంస కాండ ఇదేనని చెప్పవచ్చు. ఇంతలా నరమేధం జరుగుతున్నా, అల్లర్లు దావానలంలా వ్యాపిస్తున్నా వాటిని అడ్డుకునేందుకు గుజరాత్ సీఎంగా ఉన్న నేటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏమాత్రం పట్టించుకోలేదనే వాదనలు నేటికీ వినిపిస్తున్నాయి.

గోద్రా మరకల నుంచి క్లీన్ చిట్: అల్లర్లలో హతమైన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్‌సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ గుల్బర్గ్ సొసైటీ మారణకాండపై దాఖలు చేసిన పిటిషన్‌లో మోడీతో సహా 61 మందిపై హత్య, కుట్ర అభియోగాలు నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏళ్ల తరబడి సాగిన ఈ విచారణలో నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ లభించింది. ఈ అల్లర్లపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టీస్ నానావతి కమిషన్‌ తన నివేదికలో ఈ మేరకు పొందుపరిచింది.

ప్రధానిగా మోదీ ప్రస్థానం: 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి 2014 మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. స్వచ్ఛభారత్, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన,శ్రమయోగి మాన్ ధన్ యోజన, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, జన్ సురక్ష, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, మేక్ ఇన్ ఇండియా, యోగా దివస్ వంటి పథకాలతో ప్రజలకు మరింత చేరువ అయ్యారు. తిరిగి 2019 ఎన్నికలలో గెలిచి రెండో సారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయం తీసుకుని దేశ రాజకీయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు.

ప్రధాని కావాలని ఎప్పుడూ కోరుకోలేదు: రాజకీయాల్లో తాను ఎన్నడూ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాలని కోరుకోలేదని, కాకపోతే గుజరాత్ ముఖ్యమంత్రి కావాలని మాత్రం కోరుకున్నట్టు వెల్లడించారు. ప్రదాని కావాలని ఎప్పుడూ కలలు కనలేదని, ప్రజలే తనను ప్రధానిగా చూడాలని కాంక్షించారని చెప్పుకొచ్చారు. రాజకీయ సుధీర్గ ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నట్టు, ఓటిమి ఎదురైన సందర్బాల్లో కృంగి పోకుండా పడిలేచిన కెరటంలాగా దూసుకుపోయానని తెలిపారు.ఇటీవల బేర్ గ్రిల్స్ తో కలిసి నటించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో భాగంగా తన అనుభవాలను అందరితో పంచుకున్నారు.

మోడీ జీవితంపై సినిమా: నరేంద్ర మోడీ జీవితం అంతా తెరిచిన పుస్తకమని అంతా అనుకుంటున్నారు. కాని ఆయన యుక్త వయసులో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ మరియు దేశం గురించి ఆయన ఆలోచన ఎలా ఉండేది అనే విషయాలు ఎవరికి తెలియవు. మోడీ జీవితంలో ఈ మలుపు చాలా కీలకం. అందుకే ఆ విషయాలతో మోడీ బయోపిక్ ను నిర్మించేందుకు సంజయ్ లీలా భన్సాలీ సిద్దం అయ్యాడు. కథ బాగా నచ్చడంతో నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లుగా సంజయ్ లీలా భన్సాలీ అంటున్నారు. సంజయ్ త్రిపాఠి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. కాగా ఈ ఏడాది ఆరంభంలో వివేక్ ఒబేరాయ్ లీడ్ రోల్ లో 'నరేంద్ర మోడీ' చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రంలో టచ్ చేయని అంశాలతో సంజయ్ త్రిపాఠి తన మోడీ బయోపిక్ ను తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి 'మన్ బైరాగీ' అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది.

Happy Birthday PM Narendra Modi

నేడు 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మోడీకి యావధ్బారతం శుభాకాంక్షలను తెలియజేస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఆయనకు కోట్ల మంది ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ట్విట్టర్‌లో మోడీ పుట్టిన రోజుకు సంబంధించి 3 ట్రెండింగ్స్  #NarendraModiBirthday, #HappyBdayPMModi, #HappyBirthdayNarendraModi నడుస్తుండటాన్ని బట్టీ ఆయన పట్ల ప్రజల్లో ఎంతటి అభిమానం ఉందో ఇట్టే చెప్పవచ్చు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now