Six Drown During Ganesh Idol Immersion: గణేష్ నిమజ్జనంలో విషాదం, హర్యానాలో ఏడుగురు మృతి, మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం ఖట్టర్
అక్కడ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. నలుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు. రాత్రే గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు
Sonipat, SEP 10: గణేష్ నిమజ్జనంలో (Ganesh idol immersion) విషాదం చోటు చేసుకుంది. నిమజ్జన సమయంలో నీటిలో పడి ఏడుగురు మరణించారు. ఈ విషాద ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. సోనిపట్ లో (Sonipat) ముగ్గురు మరణించగా, మహేంద్రగఢ్ లో నలుగురు నీటిలో మునిగి మృతిచెందారు. ఆగస్టు 31న ప్రారంభమైన గణేష్ చతుర్ధి ప్రారంభమైంది. పది రోజులపాటు గణనాథులకు ప్రత్యేక పూజల అనంతరం శుక్రవారం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో గణనాథులను గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ క్రమంలో హర్యానాలోని సోనిపట్‌లోని మిమార్‌పూర్ ఘాట్ వద్ద తన తండ్రి, కుమారుడు, మేనల్లుడు కలిసి గణపయ్యను నిమజ్జనానికి తీసుకెళ్లారు. గణపయ్యను నిమజ్జనం చేస్తున్న క్రమంలో వారు నీటిలోకి దిగారు. తొలుత కుమారుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. అతన్ని కాపాడేందుకు తండ్రి, మేనల్లుడు ప్రయత్నం చేసే క్రమంగా నీటిలో మునిగిపోయారు.
వీరిని రక్షించేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు విఫలం కావటంతో వారు ముగ్గురు మృతిచెందారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహేంద్రగర్హ్‌కు (Mahendergarh) సమీపంలోని ఓ కెనాల్‌లో గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు తొమ్మిది మంది వెళ్లారు. అక్కడ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. నలుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు. రాత్రే గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. ఈ రెండు ఘటనలపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇది హృదయ విదారక ఘటన అని సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.