Coronavirus in India: ఢిల్లీని వణికించిన డెల్టా వేరియంట్, క్రమంగా కోలుకున్న దేశ రాజధాని, వ్యాక్సిన్ తీసుకోని వారికే కరోనా ముప్పు ఎక్కువ, దేశంలో తాజాగా 35,499 కోవిడ్ కేసులు నమోదు, 447 మంది మృతి
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,69,954కు (Coronavirus in India) చేరింది. ఇక మరణాల విషయానికొస్తే... నిన్న 447 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,28,309కు పెరిగింది.
New Delhi, August 9: భారత్‌లో గత 24 గంటల్లో 35,499 కరోనా కేసులు (India Logs 35,499 Fresh Coronavirus Cases) నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,69,954కు (Coronavirus in India) చేరింది. ఇక మరణాల విషయానికొస్తే... నిన్న 447 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,28,309కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,11,39,457 మంది కోలుకున్నారు. 4,02,188మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 50,86,64,759 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్రకటించారు. రికవరీ రేటు 97.40 శాతంగా ఉంది. నిన్న 16,11,590 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటివరకు 58.86లక్షల డోసులు ప్రజలకు అందాయి.
ఢిల్లీపై కరోనా డెల్టా వేరియంట్ (Delta Variant) పంజా విసిరింది. గత మూడు నెలల్లో ప్రభుత్వం పంపిన నమూనాల్లో డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు జీనోమ్ సీక్వెన్సింగ్‌లో తేలింది. దాదాపు 80 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్‌గా గుర్తించారు. ఢిల్లీలో కోవిడ్ నియంత్రణకు ఏర్పాటైన డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ ఒక సమావేశంలో ఆరోగ్యశాఖకు పలు వివరాలు తెలిపింది. ఢిల్లీలో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన 83.3 శాతం శాంపిల్స్‌లో డెల్టా వేరియంట్ (B.1.617.2) గుర్తించినట్లు పేర్కొంది.
మేలో 81.7, జూన్‌లో 88.6, ఏప్రిల్‌లో 53.9 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) లో ఢిల్లీ నుంచి 5,752 శాంపిల్స్‌లో 1,689లో డెల్టా, 947 నమూనాలు ఆల్ఫా వేరియంట్ కేసులు రికార్డయ్యాయి. ఈ రెండు వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లిష్టమైన వేరియంట్లుగా వర్గీకరించింది. గతేడాది డిసెంబర్‌లో భారత్‌లో గుర్తించిన వేరియంట్ ఇప్పటికీ 95కిపైగా దేశాలకు పాకింది.
రెండో దశ వ్యాప్తికి డెల్టా వేరియంట్ ప్రధాన కారణమని గుర్తించారు. లక్షలాది మంది జనం వేరియంట్ బారినపడగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం నమోదు కాలేదు. ఇప్పటి వరకు ఢిల్లీలో కొవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 25,066కు పెరిగింది. 24 గంటల్లో ఒక్క మరణం నమోదుకాకపోవడం వారంలో ఇది మూడోసారి.
కొవిడ్-19 టీకా (Coronavirus Vaccination) పొందాల్సిన ఆవశ్యకతను సూచించే కొత్త విషయాన్ని అమెరికాలోని ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ (సీడీసీ) సంస్థ వెలుగులోకి తెచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్నవారితో పోలిస్తే.. తీసుకోనివారికి రెండోసారి కరోనా సోకే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా వందల మందిని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ మేరకు తేల్చారు. వీరికి గత ఏడాది కొవిడ్ సోకింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో రెండోసారి ఇన్‌ఫెక్షన్ బారిన పడ్డారు.
‘‘టీకా పొందని వారికి రీ ఇన్‌ఫెక్షన్ ముప్పు 2.34 రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడైంది. అందువల్ల గతంలో కొవిడ్ బారినపడిన వారు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి’’ అని సీడీసీ డైరెక్టర్ రోషెల్ వాలెన్‌స్కీ తెలిపారు. డెల్టా రకం కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇది అవసరమని చెప్పారు. అమెరికాలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్లలో దీని వాటా 83 శాతం మేర ఉందని వివరించారు. ముప్పు ఎక్కువగా ఉండే వయోధికులు కొవిడ్‌తో ఆసుపత్రిపాలు కాకుండా చూడటంలో టీకాలు సమర్థతను చాటాయని కూడా తెలిపారు. ఫ్లూ టీకాల కన్నా మెరుగ్గా ఇవి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.