Covid in India: కరోనాతో కంటి చూపుకు ముప్పు, ఊపిరితిత్తుల్లోని కణాలపై కోవిడ్ దాడి, వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా జాగ్రత్తలు తప్పనిసరి, దేశంలో తాజాగా 27 వేల కేసులు నమోదు, కరోనా భయంతో కేరళలో ఆలయం మూసివేత
త్రిస్సూర్‌లో ఉన్న గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో పనిచేస్తున్న 22 మంది ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది.
New Delhi, December 14: దేశంలో నిన్న 30 వేలకుపైగా నమోదవగా, ఇవాళ 27 వేల కేసులు (Coronavirus in India) రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 10.5 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (Ministry of Health and Family Welfare) ప్రకటించింది. గత 24 గంటల్లో కొత్తగా 27,071 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,84,100కు చేరింది. ఇందులో 93,88,159 మంది మహమ్మారి నుంచి బయటపడగా, 3,52,586 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. మరో 1,43,355 మంది కరోనా బారినపడి మరణించారు.
కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 30,695 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని, మరో 336 మంది బాధితులు చనిపోయారని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి డిసెంబర్ 13 వరకు మొత్తం 15,45,66,990 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. ఇందులో నిన్న ఒకేరోజు 8,55,157 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.
ఉద్యోగులకు కరోనా రావడంతో కేరళలోని ప్రముఖ దేవాలయం గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం రెండు వారాలపాటు మూసివేయనున్నారు. త్రిస్సూర్‌లో ఉన్న గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో పనిచేస్తున్న 22 మంది ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ముందుజాగ్రత్తగా ఆలయాన్ని మూసివేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈనేపథ్యంలో రెండు వారాలపాటు భక్తులను దర్శనాలకు అనుమతించడంలేదని ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా మార్గదర్శకాల అనుగుణంగా భక్తులకు ఆలయంలో ప్రవేశాలు కల్పించారు.
ఇదిలా ఉంటే శబరిమల తీర్థయాత్రలు ప్రారంభమైన నేపథ్యంలో గురువాయూర్ దేవాలయంలో ఆన్‌లైన్ బుకింగ్ కూడా ప్రారంభించారు. భక్తుల రాకుండా గురువాయూర్ ఆలయాన్ని మూసివేసినప్పటికీ పూజారుల చేత ఆలయంలో క్రమం తప్పకుండా పూజలు కొనసాగుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు. కేరళలో నిన్న ఒకేరోజు 4,698 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 59,438కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,07,119 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
గత నెలలో కోవ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా (Coronavirus Outbreak) సోకిన హర్యానా రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ విజ్ ను మెరుగైన వైద్యం కోసం అంబాలా సివిల్ ఆసుపత్రి నుంచి రోహతక్ నగరంలోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. కరోనా బారిని పడిన మంత్రి అనిల్ విజ్ కు రెమ్‌డెసివిర్‌తోపాటు ప్లాస్మాథెరపీ ఇవ్వాలని వైద్యనిపుణులు నిర్ణయించారు. రెమ్‌డెసివిర్ ఇవ్వడంతో మంత్రి అనిల్ పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు.
శరీరంలోకి కొవిడ్-19 వైరస్ చొరబడిన తర్వాత ఊపిరితిత్తుల కణాలను తన ఆవాసంగా మార్చుకునే ప్రయత్నాలను కోవిడ్ వైరస్ ప్రారంభిస్తోందని అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (బీయూఎస్ఎంఎం) శాస్త్రవేత్తలు చెబుతున్నారు . ఇందులో భాగంగా ఊపిరితిత్తుల కణాల్లో ఉండే అణువులు (మాలిక్యూల్స్), ప్రొటీన్లలో అంతర్గతంగా జరిగే ముఖ్యమైన చర్యలు గాడితప్పేలా చేస్తోంది. ఫలితంగా ఇన్ఫెక్షన్‌కు గురయ్యే ప్రతీ కణంలోనూ వైరస్ తన సంఖ్యను భారీగా పెంచుకుంటుందని వారు తెలిపారు.
కరోనా వ్యాక్సినేషన్ (Covid Vaccine) తీసుకున్న తర్వాత కూడా కొంత కాలం పాటు మాస్కు ధరించక తప్పదని శాస్ర్తవేత్తలు అంటున్నారు. భౌతికదూరం సహా కరోనా జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే.. సాధారణంగా టీకా రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసుకు.. ఫైజర్ టీకా అయితే.. రెండు వారాలు.. మొడెర్నా అయితే నాలుగు వారాల సమయం ఉంటుంది. టీకాల ప్రభావం అవి తీసుకున్న వెంటనే కనిపించదని, అందుకు కనీసం రెండు వారాలు పడుతుందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నిపుణుడు డెబోరా ఫుల్లర్ తెలిపారు.
ఇదిలా ఉంటే కరోనా రోగులపై, అలాగే కోలుకున్న రోగులపై ఓ ప్రాణాంతక ఫంగస్ దాడిచేస్తోంది. ప్రధానంగా మధుమేహం అదుపులో లేనివారు, చక్కెర వ్యాధి నియంత్రణకు బలమైన ఔషధాలు, స్టెరాయిడ్స్‌ను వినియోగించే వారిపై దీని ప్రభావం గరిష్ఠంగా ఉంటోంది. ‘మ్యూకర్ మైకోసి్‌స’గా పిలిచే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఐదు కేసులను గుర్తించినట్లు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రెటీనా, ఆక్యులర్ ట్రామా సర్జన్ పార్థ్ రాణా వెల్లడించారు. వీరిలో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరు కంటిచూపును కోల్పోయారని చెప్పారు. వీరిలో కనుపాపలు ఉబ్బి బయటికి వచ్చిన లక్షణాలను గుర్తించామని వివరించారు. కరోనా రోగులు షుగర్‌ను నియంత్రణలో పెట్టుకోవడంతో కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ ముప్పు నుంచి రక్షణ పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.