Coronavirus in India: కరోనాతో కంటిచూపు కోల్పోతున్న పేషెంట్లు, తమిళనాడులో రెండు వారాల పాటు లాక్‌డౌన్, దేశంలో తాజాగా 4,01,078 మందికి కరోనా నిర్ధారణ, 24 గంటల్లో 4,187 మంది కరోనా కారణంగా మృతి

కరోనా నుంచి కోలుకున్న 8 మంది వ్యక్తులకు కంటిచూపు పోయిన ఘటన గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. కరోనా నుంచి కోలుకున్న ఆ వ్యక్తులు కంటిచూపు కోల్పోయారు.

Coronavirus Outbreak (Photo Credits: File Image)

New Delhi, May 8: బారత్‌లో నిన్న‌ కొత్త‌గా 4,01,078 మందికి కరోనా నిర్ధారణ (India Coronavirus) అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,18,609 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,18,92,676కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 4,187 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు.

దీంతో మృతుల సంఖ్య 2,38,270కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,79,30,960 మంది కోలుకున్నారు. 37,23,446 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 16,73,46,544 మందికి వ్యాక్సిన్లు వేశారు.

తాజాగా తమిళనాడులో ఈ నెల 10వ తేదీ నుంచి రెండు వారాలపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను ( Tamil Nadu Lockdown) విధిస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో అత్యవసరం కాని సేవలన్నీ నిలిచిపోనున్నాయి. లాక్‌డౌన్ కాలంలో కిరాణ దుకాణాలను మధ్యాహ్నం 12 గంటల వరకు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చినా టేక్ అవేలకు మాత్రమే వాటిని పరిమితం చేసింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఏఎస్ఎంఏసీ) దుకాణాలను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న కెనడా వాసి మృతి, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో మరణం, అధికారికంగా వెల్లడించిన కెనడా చీఫ్ మెడికల్ ఆఫీసర్

సచివాలయం, ఆరోగ్యం, రెవెన్యూ, విపత్తు నిర్వహణ, పోలీస్, అగ్నిమాపక, జైలు విభాగం, స్థానిక అధికార యంత్రాంగం, ఈబీ, పీడ్ల్యూడీ, సాంఘిక సంక్షేమం, అటవీ విభాగాలు మాత్రం పనిచేస్తాయని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు, థియేటర్లు, జిమ్‌లు, రిక్రియేషన్ క్లబ్‌లు, బార్లు, ఆడిటోరియంలు, మీటింగ్ హాళ్లను మూసివేయాలని పేర్కొంది.

కరోనా వైరస్ సోకిందంటే శరీరంలోని కీలక అవయవాల పనితీరు బాగా దెబ్బతింటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ, ఆ వైరస్ మహమ్మారి కలిగించిన నష్టంతో అనేక మంది కోలుకోలేక మృత్యువాత పడుతున్నారు. కాగా, కరోనా వైరస్ సోకిన వ్యక్తి అనేక ఇతర జబ్బులకు కూడా గురవుతున్నట్టు వైద్యులు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న 8 మంది వ్యక్తులకు కంటిచూపు పోయిన ఘటన గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. కరోనా నుంచి కోలుకున్న ఆ వ్యక్తులు కంటిచూపు కోల్పోయారు.

వారిని పరిశీలించిన వైద్య నిపుణులు, మ్మూకోర్మిసిస్ అనే బ్లాక్ ఫంగస్ కంటిచూపును హరించివేసిందని గుర్తించారు. కాగా, ఈ ఫంగస్ ఎంతో ప్రమాదకరమని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం హరించివేస్తుందని డాక్టర్లు పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి ఈఎన్ టీ విభాగం హెడ్ డాక్టర్ అజయ్ స్వరూప్ స్పందించారు. కరోనా చికిత్సకు వాడే ఔషధాల వల్ల బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుందని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశం మొత్తమ్మీద 40 మంది వరకు బ్లాక్ ఫంగస్ బారినపడ్డారని నివేదికలు చెబుతున్నాయి.