Omicron in Maharashtra: దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు, కొత్త వేరియంట్ సోకి చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయినట్టు ప్రకటించిన అధికారులు, మహారాష్ట్రను వణికిస్తున్న కరోనావైరస్
మహారాష్ట్రలోని పింప్రి చిన్వాడ్ ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. అతడికి కరోనా ఒమిక్రాన్ పాజిటివ్ గా (Omicron in India) నిర్ధారణ అయింది. అయితే, అధికారులు మాత్రం అతను ఒమిక్రాన్ కారణంగా చనిపోలేదని, ఇతర అనారోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయాడని పేర్కొంటున్నారు.
Mumbai, Dec 31: దేశంలో కరోనా ఒమిక్రాన్ వైరస్ కారణంగా తొలిసారి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని పింప్రి చిన్వాడ్ ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. అతడికి కరోనా ఒమిక్రాన్ పాజిటివ్ గా (Omicron in India) నిర్ధారణ అయింది. అయితే, అధికారులు మాత్రం అతను ఒమిక్రాన్ కారణంగా చనిపోలేదని, ఇతర అనారోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయాడని పేర్కొంటున్నారు.
యశ్వంత్ రావు చవాన్ ఆసుపత్రిలో సదరు బాధితుడు కరోనాకు చికిత్స పొందుతూ ఈ నెల 28న మృతి (India Records First Omicron Death) చెందినట్టు వైద్యులు ప్రకటించారు. అతను నైజీరియా నుంచి రావడంతో కరోనా బారిన పడ్డాడు. ‘‘రోగికి 13 ఏళ్ల నుంచి మధుమేహం సమస్య ఉంది. అతడు కరోనాయేతర కారణాలతో మరణించాడు. ఒమిక్రాన్ రకం ఇన్ఫెక్షన్ బారినపడినట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రిపోర్ట్ తెలియజేసింది’’ అని అధికారులు ప్రకటన విడుదల చేశారు.
ఒమిక్రాన్ కేసులు (Omicron Cases) పెరుగుతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను కొనసాగిస్తోంది. ఒకేచోట 50 మంది, అంతకంటే ఎక్కువమంది గుమికూడవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు పెళ్లిళ్లు, వేడుకలను 250 మంది హాజరు కావచ్చునని చెప్పిన ప్రభుత్వం.. తాజాగా ఆ ఆంక్షలను సవరించింది. 50 మంది కంటే ఎక్కువమంది హాజరు కావద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే అంత్యక్రియలకు 20 మందిని మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాగా దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1270కి చేరింది. ఇప్పటివరకూ 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 450, ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్ 97, రాజస్థాన్ 69, తెలంగాణ 62, తమిళనాడులో 46, కర్ణాటక 34 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్‌లో ఒమిక్రాన్ నుంచి 374 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
IANS Tweets
మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 5,368 కొత్త కోవిడ్ కేసులు (Covid in maharashtra) 22 మరణాలు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే గురువారం ప్రకటించారు. బుధవారంతో పోల్చితే 1468 కేసులు పెరిగినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 18,217కి చేరినట్లు చెప్పారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు ముంబైలోనే నమోదయ్యాయి.
ముంబైలో ఇవాళ 3,671 కోవిడ్ కేసులు నమోదుకాగా,నిన్న నమోదైన కేసుల కంటే 46.25శాతం కేసులు అధికంగా నమోదైనట్లు మంత్రి రాజేష్ తోపే తెలిపారు. ముంబైలో పాజిటివిటీ రేటు 8.48శాతంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ఈ ఏడాది మే-5 తర్వాత ముంబైలో ఒక్కరోజులో నమోదైన కోవిడ్ కేసుల్లో ఇదే అత్యధికం. అయితే ముంబైలో ఇవాళ ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదుకాకపోవడం కొంత ఊరట కలిగించే విషయం.