Coronavirus in India: దేశంలో వంద కోట్ల మార్కును దాటిన కరోనా టీకాల పంపిణీ, తాజాగా 18,454 కొత్త కోవిడ్ కేసులు, 2021 జనవరి 16న భారత్‌లో ప్రారంభమైన వ్యాక్సినేషన్
గురువారం ఉదయం నాటికి దేశంలో కరోనా టీకాల పంపిణీ వంద కోట్ల డోసుల మార్కును చేరింది. ఇప్పటివరకు బిలియన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో చైనా (China) తర్వాత బిలియన్ డోసులు పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది.
New Delhi, Oct 21: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ (Corona Vaccination) ప్రక్రియ మరో మైలురాయిని అధిగమించింది. గురువారం ఉదయం నాటికి దేశంలో కరోనా టీకాల పంపిణీ వంద కోట్ల డోసుల మార్కును చేరింది. ఇప్పటివరకు బిలియన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో చైనా (China) తర్వాత బిలియన్ డోసులు పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది.
ఈ ఏడాది చివరినాటికి దేశంలోని మొత్తం 94.4 కోట్ల మంది వయోజనులకు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకున్నది. ఇండియాలో ఇప్పటివరకు ఇచ్చిన వ్యాక్సిన్ డోసులు అమెరికాలో ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల కన్నా రెట్టింపు స్థాయిలో ఉన్నాయి, జపాన్‌లో కన్నా ఐదు రెట్లు, జర్మనీలో కన్నా తొమ్మిది రెట్లు, ఫ్రాన్స్‌లో కన్నా 10 రెట్లు అధికం.
దేశ జనాభాలో వ్యాక్సిన్ (Covid Vaccine) తీసుకునేందుకు అర్హులైనవారిలో 75 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జమ్మూ-కశ్మీరు, లడఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, గోవా, లక్షద్వీప్ నూటికి నూరు శాతం తొలి డోస్ వ్యాక్సినేషన్ జరిగినట్లు తెలిపింది. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అర్హులైనవారిలో 90 శాతం మందికి తొలి డోసు వ్యాక్సినేషన్ జరిగినట్లు పేర్కొంది.
ఈ చరిత్రాత్మక ఘనత సాధించేందుకు మన దేశానికి 9 నెలలు పట్టింది. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఓ పాటను ఆవిష్కరించడంతోపాటు ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద అతి పెద్ద జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించింది. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశంలోని మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడం కోసం డ్రోన్లను కూడా ఉపయోగించడం విశేషం.
గత 24 గంటల్లో 18,454 కొత్త Corona కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,41,27,450కి చేరింది.మరో వైపు కరోనాతో 160 మంది చనిపోయారు. నిన్న ఒక్క రోజు 12,47,506 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,52,811కి చేరింది. మరోవైపు నిన్న 17,561 మంది కరోనా నుండి కోలుకొన్నారు. దీంతో కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 3,34,95,808కి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా రోగుల రికవరీ రేటు 98.15శాతానికి చేరిందని వైద్య ఆరోగ్యశాఖాధికారులు ప్రకటించారు. మరో వైపు కరోనా యాక్టివ్ కేసులు 1,78,831 కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.52 శాతంగా నమోదైందని ICMR తెలిపింది.
కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్న మాత్రం కరోాన కేసులు 11,150కి చేరాయి. కేరళ రాష్ట్రంలో 48,70,584కి కేసులు చేరుకొన్నాయి. ఈ నెల 14 నుండి 19వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి.కానీ నిన్న మాత్రం అధికంగా కేసులు రికార్డయ్యాయి. నిన్న ఒక్క రోజు కేరళ రాష్ట్రంలో 82 మంది కరోనాతో మరణించారు.దీంతో కేరళలో 27,084 మంది చనిపోయారు. కేరళలో కరోనా నుండి 47,69,373 మంది కోలుకొన్నారు.దేశంలో కరోనా వ్యాక్సిన్ 100 కోట్ల మైలురాయిని దాటింది.