COVID19 in India: గడిచిన ఐదు నెలల్లో పదేళ్లలోపు పిల్లల్లో పెరిగిన కోవిడ్ వ్యాప్తి; భారత్‌లో కొత్తగా 25,404 కోవిడ్ కేసులు, 339 మరణాలు నమోదు మరియు 37,127 మంది రికవరీ

దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 75.22 కోట్లు దాటింది....

Coronavirus | Image used for representational purpose | (Photo Credits: PTI)

New Delhi, September 14: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రోజూవారీ కోవిడ్ కేసులు నిన్నటి కంటే ఈరోజు తక్కువగా నమోదయ్యాయి, అయితే ఎప్పట్లాగే కేరళ నుంచి అత్యధిక కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశలో పిల్లల్లో కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. గత మార్చికి ముందు పదేళ్ల లోపు పిల్లల్లో పాజిటివిటీ రేటు 2.08గా ఉండగా, ఆగష్టు చివరి నాటికి పిల్లల్లో వ్యాప్తి 7.04 శాతానికి పెరిగడం కొంత ఆందోళన కలిగిస్తుంది. అయినప్పటికీ పిల్లలు వెంటనే కోలుకుంటున్నారని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

ఇక, గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 25,404 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 339 కోవిడ్ మరణాలు సంభవించాయి. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 15,058 కేసులు, 99 మరణాలు ఉన్నాయి.

తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,89,579 కు చేరింది, అలాగే ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,43,213కు పెరిగింది.

ఇక, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,127 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,24,84,159 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,62,207 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.58% కు చేరగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.09 శాతానికి పెరిగాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.33% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

సెప్టెంబర్ 13 నాటికి దేశవ్యాప్తంగా 54,44,44,967 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 14,30,891 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 78,66,950 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 75.22 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 75,22,38,324 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 57.05 కోట్లు ఉండగా,  18.17 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.