Coronavirus in India: ఇది థర్డ్ వేవ్ హెచ్చరికేనా..రాష్ట్రాల్లో పెరుగుతున్నకరోనా కేసులు, దేశంలో తాజాగా 30,941 పాజిటివ్ కేసులు నమోదు, 350 మంది మృతి
ఈ మహమ్మారి నుంచి మరో 36,275 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,70,640 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,38,560 మంది కరోనాకు బలయ్యారు.
New Delhi, August 31: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,941 పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదు కాగా, 350 మంది ( 350 deaths ) మరణించారు. ఈ మహమ్మారి నుంచి మరో 36,275 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,70,640 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,38,560 మంది కరోనాకు బలయ్యారు. కేరళలో కొత్తగా 19,622 కేసులు నమోదు కాగా, 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటి వరకు 64.05 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.
కొన్ని రాష్ట్రాల్లో తాజాగా కరోనా కేసులు పెరుగుతుండటం రాబోయే థర్డ్ వేవ్‌కు సంకేతాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నిపుణులు డాక్టర్ సామిరన్ పాండా ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ముందుగానే థర్డ్ వేవ్ ముంచుకొస్తుందని తాము ఎప్పుడూ ఊహించలేదని సోమవారం తెలిపారు. పండుగల సీజన్‌లో సామూహిక వేడుకల్లో కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించకపోతే అవి సూపర్ స్పెడింగ్ వేడుకలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కరోనా సెకండ్ వేవ్ కంటే ముందుగా థర్డ్ వేవ్ దూసుకొస్తుందని తెలిపారు. సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా చవి చూడని రాష్ట్రాల్లో ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు ఆంక్షలు ముందస్తుగా ఉపసంహరించొద్దని సూచించారు. మిజోరం, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని గుర్తు చేశారు.