COVID in India: దేశంలో తీవ్రరూపం దాలుస్తున్న కరోనా, మరో రోజు కూడా అత్యధికంగా 34,884 కేసులు నమోదు, భారత్‌లో 1,038,716కు చేరిన కొవిడ్ బాధితుల సంఖ్య, 26 వేలు దాటిన కరోనా మరణాలు
దిల్లీ, ముంబై, చెన్నై, పుణె, చెన్నై, నాగ్‌పూర్ మరియు అహ్మదాబాద్ నుండి కోల్‌కతాకు ప్రయాణీకుల విమానాల సేవలు అందుబాటులో ఉండవు....
New Delhi, July 18: భారతదేశంలో కరోనావైరస్ విజృంభన కొనసాగుతోంది. ఇటీవల కాలంగా ఒకరోజులో నమోదయ్యే కేసుల సంఖ్య 30 వేలను దాటి 35 వేల వరకు వెళ్తుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 34,884 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 10,38,716 కు చేరింది. నిన్న ఒక్కరోజే 671 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 26,273 కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,994 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 653,751 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 3,58,692 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India's COVID19 Tracker:
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పలు నగరాల నుంచి కోల్‌కతా నగరానికి విమానాల రాకపోకల నిషేధాన్ని జూలై 31 వరకు పొడగించినట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. దిల్లీ, ముంబై, చెన్నై, పుణె, చెన్నై, నాగ్‌పూర్ మరియు అహ్మదాబాద్ నుండి కోల్‌కతాకు ప్రయాణీకుల విమానాల సేవలు అందుబాటులో ఉండవు.
ప్రపంచవ్యాప్తంగా, 13 మిలియన్లకు పైగా ప్రజలు కరోనావైరస్ బారిన పడగా, ఇప్పటివరకు 5,86,174 మంది మరణించారు. అత్యధిక సంఖ్యలో కేసులు (3,536,658) మరియు మరణాలు (137,897) యునైటెడ్ స్టేట్స్ నుండి నివేదించబడ్డాయి. కొవిడ్ తీవ్రత దృష్ట్యా అమెరికాలో మరోసారి లాక్డౌన్ విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మరోవైపు COVID-19 వ్యాక్సిన్ కోసం ప్రపంచం అత్రుతగా ఎదురుచూస్తున్న వేళ పరిశోధకుల నుండి వ్యాక్సిన్‌కు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించడానికి రష్యా ప్రయత్నిస్తోందని బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా ఆరోపించాయి.