Coronavirus in India: వ్యాక్సినేషన్‌లో చైనా రికార్డు బ్రేక్ చేసిన భారత్, దేశంలో తాజాగా 35,662 మందికి కోవిడ్, ప్రస్తుతం 3,40,639 కేసులు యాక్టివ్
దీంతో ఇది నిన్నటికంటే 3.65 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 35,662 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,34,17,390కి చేరింది.
New Delhi, Sep 18: దేశంలో శుక్రవారం 34 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 35 వేలు (Coronavirus in India) దాటాయి. దీంతో ఇది నిన్నటికంటే 3.65 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 35,662 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,34,17,390కి చేరింది. ఇందులో 3,40,639 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 3,26,32,222 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 33,798 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా వ్యాక్సినేషన్ సరికొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్ (Coronavirus Vaccination,) చేశారు. దీంతో ఇప్పటివరకు చైనా పేరుతో ఉన్న ఒక్కరోజులో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన రికార్డును భారత్ తుడిపివేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 వరకు 55,07,80,273 నమూనాలకు పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) తెలిపింది. నిన్న ఒకేరోజు 14,48,833 మందికి పరీక్షలు చేశామని వెల్లడించింది.
శుక్రవారం సాయంత్రం వరకు ఇండియాలో ఒకే రోజు వ్యాక్సినేషన్ రెండు కోట్లు దాటినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సౌత్ ఈస్ట్ ఏషియా ఆఫీసు తన ట్వీట్‌లో తెలిపింది. మరో మైలురాయిని అందుకున్న ఇండియాకు డబ్ల్యూహెచ్‌వో కంగ్రాట్స్ తెలిపింది. హెల్త్ వర్కర్లతో మంత్రి మాండవీయ ఈ మైలురాయిని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే శుక్రవారం రోజున ప్రధాని మోదీ 71వ పుట్టిన రోజు కావడం విశేషం.