Covid in India: భారీగా పెరుగుతున్న రికవరీ రేటు, దేశంలో 3.53 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్, తాజాగా 3,66,317 మందికి కోవిడ్, గడచిన 24 గంటల్లో కరోనాతో 3,747 మంది మృతి
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,26,62,410కు చేరింది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 3.53 లక్షల మంది కోలుకున్నారు.
New Delhi, May 10: దేశంలోని గడచిన 24 గంటల్లో కొత్తగా 3,66,317 మంది కరోనా (India Coronavirus) బారినపడగా, ఇదే సమయంలో కరోనా మృతుల సంఖ్య కొద్దిగా క్షీణించి 3,747 వద్ద ఆగిపోయింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,26,62,410కు చేరింది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 3.53 లక్షల మంది కోలుకున్నారు. ఇదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో కరోనాతో 3,747 మంది మృతి (Covid Deaths) చెందగా, మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,46,146 కు చేరింది.
దేశంలో కరోనాకు చికిత్స పొందుతున్న వారిసంఖ్య 37,41,368కు చేరింది. దేశంలో మరణాల రేటు 1.09 శాతంగా ఉండగా, గత 24 గంటల్లో కరోనా కారణంగా మహారాష్ట్రలో అత్యధికంగా మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో నమోదైన 3,66,317 కేసుల్లో 71.75 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీతో సహా 10 రాష్ట్రాలకు చెందినవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశ రాజధాని నగరంలో వ్యాప్తిచెందుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మెట్రోరైళ్ల రాకపోకల రద్దును మే 17వతేదీ వరకు పొడిగించారు. ఢిల్లీలో లాక్ డౌన్ గడువును పెంచిన నేపథ్యంలో మే 17వతేదీ ఉదయం 5 గంటల వరకు మెట్రోరైలు సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించినట్లు మెట్రోరైల్ అధికారులు తాజాగా ప్రకటించారు.
కరోనా కట్టడి కోసం మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ ను సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పొడిగించారు. దీంతో మెట్రోరైలు సర్వీసులను కూడా మే 17వతేదీ వరకు నిలిపివేశామని ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ సోమవారం ట్వీట్ చేసింది. ఢిల్లీలో శనివారం 13,336 కరోనా కేసులు నమోదు కాగా 273 మంది మరణించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో లాక్ డౌన్ తో పాటు కఠిన ఆంక్షలు విధించారు.
ఇండియాలో వ్యాక్సిన్ల ధరలు, కొరత, నెమ్మదిగా సాగుతున్న ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. తమ వ్యాక్సినేషన్ విధానాన్ని సమర్థించుకున్న ప్రభుత్వం.. ఈ విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం అనసవరం అంటూ.. వ్యాక్సిన్లపై నిర్ణయాలను మాకు వదిలేయండి. ఈ నిర్ణయాన్ని ప్రజల ప్రయోజనార్థం మెడికల్, సైంటిఫిక్ ఎక్స్‌పర్ట్స్ సూచనల మేరకు తీసుకున్నామని స్పష్టం చేసింది.
ఆదివారం అర్ధరాత్రి వేళ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. సోమవారం దీనిపై కోర్టు విచారణ జరపనుంది. వ్యాక్సిన్ల ధరలను మరోసారి పరిశీలించాలని గతవారం కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ఈ విషయంలో మాత్రం కోర్టు జోక్యం వద్దని కేంద్రం వాదిస్తోంది. అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నాం. ఇందులో న్యాయ వ్యవస్థ జోక్యం అనవసరం. ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పాలకులకే ఈ నిర్ణయాన్ని వదిలేయండి అని తన అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది.