Covid in India: కొత్త వేరియంట్లు వస్తేనే థర్డ్ వేవ్‌కు అవకాశం, దేశంలో కరోనా అదుపులోనే ఉందని తెలిపిన ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్, భారత్‌లో తాజాగా 38,948 కోవిడ్ కేసులు నమోదు
ఈ సంఖ్యతో మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు (Coronavirus in India) చేరింది. ఇందులో 4,04,874 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,40,752 మంది వైరస్ వల్ల మరణించారు.
New Delhi, Sep 6: దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు (Covid in India) నమోదయ్యాయి. ఈ సంఖ్యతో మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు (Coronavirus in India) చేరింది. ఇందులో 4,04,874 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,40,752 మంది వైరస్ వల్ల మరణించారు. ఇక ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 43,903 మంది కోలుకోగా, 219 మంది మృతి ( 219 deaths in the last 24 hours) చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
అదేవిధంగా తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే 26,701 పాజిటివ్ కేసులు ఉన్నాయని, 74 మంది మరణించారని తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా 68,75,41,762 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5 వరకు 53,14,68,867 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR) ప్రకటించింది. ఇందులో ఆదివారం 14,10,649 మందికి పరీక్షలు చేశామని తెలిపింది.
దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ముప్పుపై ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాలోని కొత్త వేరియంట్లు రాకపోతే దేశంలో థర్డ్‌వేవ్ రాబోదని ఆయన తెలిపారు. డెల్టా వేరియంట్ ఒక్కటే ఉండి, మరో వేరియంట్ గనుక రాకపోతే మనం కరోనాపై చేస్తున్న పోరాటంలో విజయం సాధించినట్లేనన్నారు. కేరళలో కరోనా విజృంభణ గురించి మణీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ దేశవాప్తంగా కరోనా దాదాపు కట్టడిలోకి వచ్చింది.
ఒక్క కేరళలో వైరస్ అదుపులోకి వస్తే, దేశవ్యాప్తంగా కరోనా కట్టడి సాధ్యమయ్యిందని చెప్పుకోవచ్చు. రాబోయే నెల రోజుల్లో కేరళలోనూ కరోనా అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయన్నారు. దేశంలోని 75 శాతం ప్రజలు కరోనాతో పోరాడగలిగే స్థాయిలో ఇమ్యూనిటీని సాధించారు. ఉత్తరప్రదేశ్‌లో కరోనా వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది. ఆ రాష్ట్రంలో తీసుకున్న కఠినమైన కట్టడి చర్యల కారణంగా వైరస్ నియంత్రణ సాధ్యమయ్యింది. దేశంలో ముమ్మర వ్యాక్సినేషన్ ద్వారానే కరోనా కట్టడి సాధమన్నారు.