Coronavirus in India: ఓవైపు డెల్టా ప్రమాద ఘంటికలు, మరోవైపు డేంజర్‌జోన్‌లోకి వెళుతున్న కేరళ, దేశంలో తాజాగా 41,649 మందికి కరోనా, గడిచిన 24 గంటల్లో 593 మంది మృతి

గడిచిన 24 గంటల్లో 593 మంది కోవిడ్‌ బాధితులు మృతి (COVID 19 Deaths in India) చెందారు. దీంతో కరోనా వైరస్‌ బారినపడి మొత్తం 4,23,810 మంది ప్రాణాలు కోల్పోయారు.

A resident gets tested for coronavirus in the Liwan District in Guangzhou in southern China (Photo: PTI)

New Delhi, july 21: భారతదేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,649 కరోనా పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 593 మంది కోవిడ్‌ బాధితులు మృతి (COVID 19 Deaths in India) చెందారు. దీంతో కరోనా వైరస్‌ బారినపడి మొత్తం 4,23,810 మంది ప్రాణాలు కోల్పోయారు.

అంతేకాకుండా గత 24 గంటల్లో 37,291 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,07,81,263 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 4,08,920 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 31,613,993 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 45,60,33,754 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కేరళలో వరుసగా నాలుగో రోజు కూడా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్‌ కేసులు 1.6 లక్షలకు పెరిగాయి. గత రెండు నెలలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. కాగా, గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 20,772 కరోనా కేసులు, 116 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,70,137కు, మొత్తం మరణాల సంఖ్య 16,701కు పెరిగింది.

కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం, ఆగస్టు 31 వరకు కోవిడ్ గైడ్‌లైన్స్ పొడిగింపు, అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, కరోనా నియమాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు

మరోవైపు గత 24 గంటల్లో 14,651 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 31,92,104కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,60,824 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది.

దేశవ్యాప్తంగా 70 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ( Delta variant ) కేసులను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో రెండు కేసులను తెలంగాణాలో కనుగొన్నట్లు పేర్కొంది. శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో భాగంగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు వెల్లడించారు. దేశంలో SARS-CoV-2 యొక్క జన్యు శ్రేణిని పర్యవేక్షించే ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (ISACOG) ఈ మేరకు గుర్తించినట్లు తెలిపారు.

దేశంలోని 28 ప్రయోగశాలల్లో కరోనా వేరియంట్లకు సంబంధించిన 58,240 నమూనాలను ISACOG పరీక్షించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. వీటిలో 46,124 నమూనాలను జన్యుపరంగా విశ్లేషించినట్లు వివరించారు. 4172 నమూనాలు ఆల్ఫా వేరియంట్, 217 నమూనాలు బీటా వేరియంట్, ఒక నమూనా గామా వేరియంట్, 17,169 నమూనాలు డెల్టా వేరియంట్, 70 డెల్లా ప్లస్‌ వేరియంట్లను గుర్తించినట్లు వెల్లడించారు.

దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 23 డెల్టా ప్లస్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. తమిళనాడులో 10, మధ్యప్రదేశ్‌లో 11, చండీగఢ్‌లో నాలుగు, కేరళ, కర్ణాటకలో మూడు చొప్పున, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో రెండు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జమ్మూ, హర్యానా, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్కటి చొప్పున డెల్టా ప్లస్‌ కేసులు నమోదైనట్లు వివరించారు.