IPL Auction 2025 Live

Coronavirus in India: కరోనా అంతానికి వ్యాక్సిన్ అవసరం లేదు, కీలక వ్యాఖ్యలు చేసిన ఫైజర్‌ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మైఖేల్‌ ఈడన్‌, దేశంలో తాజాగా 41,810 కోవిడ్ కేసులు

దీంతో మొత్తం కేసుల సంఖ్య 93,92,920కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 496 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,36,696కు (Covid Deaths) చేరుకుందని తెలిపింది.

Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, November 29: దేశంలో గత 24 గంటల్లో 41,810 కొత్త కరోనా కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 93,92,920కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 496 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,36,696కు (Covid Deaths) చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శనివారానికి 88,02,267కు చేరుకుంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,53,956గా ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 42,298 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.

కరోనా వైరస్‌ను అంతమొందించడానికి వ్యాక్సిన్ల అవసరం లేదని అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్‌ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖశాస్త్రవేత్త డాక్టర్‌ మైఖేల్‌ ఈడన్‌ స్పష్టం చేశారు. ఇన్ఫెక్షన్‌ ముప్పు లేని ప్రజలకు వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరమే లేదన్నారు. మనుషులపై విస్తృత ప్రయోగ పరీక్షలను పూర్తిచేసుకోని వ్యాక్సిన్లను కోట్లాది మంది ఆరోగ్యవంతులైన ప్రజలకు అందించాలన్న ఆలోచన సరికాదన్నారు. కరోనా పరీక్షలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించిన దేశాల్లో ఇన్ఫెక్షన్లు చాలా సులువుగా అదుపులోకి వచ్చాయని గుర్తు చేశారు. కొవిడ్‌ కేసులు, మరణాల్లో దాదాపు సగం 4 దేశాలవేనని ఆయన తెలిపారు. స్థూలంగా పరిశీలిస్తే 70శాతం కేసులు, మరణాలు 10 దేశాల్లోనే నమోదవుతున్నాయని చెప్పారు.

మాటల్లేవ్.., మా డిమాండ్లు నెరవేర్చాల్సిందే, ఢిల్లీలో కదం తొక్కుతున్న రైతులు, మూడో రోజుకు చేరిన చలో ఢిల్లీ నిరసన కార్యక్రమం

కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి సీరం ఇనిస్టిట్యూట్‌ రెండు వారాల్లో దరఖాస్తు చేయనున్నట్లు సీరం ఇస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ను పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ కోవిషీల్డ్‌ పేరుతో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ శనివారం ఇనిస్టిట్యూట్‌ను సందర్శించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతానికి ఎవరు ఎన్ని మోతాదులు కొనుగోలు చేస్తారనే సమాచారం లేదని, కానీ జూలై 2021 నాటికి 300-400 మిలియన్‌ డోసులు మోతాదులు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కోసం రాబోయే రెండు వారాల్లో దరఖాస్తు చేసే పనిలో నిమగ్నమైనట్లు చెప్పారు. ప్రస్తుతం కోవిషీల్డ్‌ ట్రయల్స్‌, భద్రతపై స్పందిస్తూ ప్రస్తుతానికి ట్రయల్స్‌ సమర్థవంతంగా ఉందని చెప్పారు. 18 ఏళ్లపైబడిన వ్యక్తులకు టీకాలు వేయగా.. మెరుగైన ఫలితాలు చూపిందని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకు 50-60 మిలియన్‌ డోసులు, జనవరి తర్వాత 100 మిలియన్‌ డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు.

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీ ప్రక్రియ వ్యక్తిగతంగా సమీక్షించేందుకు శనివారంమోదీ టీకా తయారీ కేంద్రాలను సందర్శించారు. దేశ పౌరులకు టీకాలు వేసే ప్రయత్నంలో సన్నాహాలు, సవాళ్లు, రోడ్‌మ్యాప్‌లపై సమీక్షించారు. గుజరాత్‌లోని ఫార్మా మేజర్ జైడస్ కాడిలా ప్లాంట్‌ను సందర్శించి, తర్వాత హైదరాబాద్‌కు వెళ్లారు. భారత్ బయోటెక్‌ను సందర్శించారు, కొవాగ్జిన్‌ టీకా వివరాలు అడిగి తెలుకున్నారు. అనంతరం పూణేకు వెళ్లి సీరం ఇనిస్టిట్యూట్‌ను సందర్శించిన విషయం తెలిసిందే.